Bro Daddy Remake | మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘బ్రో డాడీ’ గత ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ తండ్రీ కొడుకులుగా కనిపించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. మోహన్‌లాల్ పాత్రను అగ్ర నటుడు చిరంజీవి పోషించబోతున్నారు. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. ఈ చిత్రంలో కొడుకు పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం యువ హీరో శర్వానంద్‌ను చిరంజీవి కొడుకు పాత్రకు ఎంపిక చేశారని తెలిసింది. ఈ నెల 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఈ చిత్రంలో త్రిష, శ్రీలీల కథానాయికలుగా నటించనున్నారని వార్తలొస్తున్నాయి. తెలుగు నేటివిటికీ అనుగుణంగా ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేశారని చెబుతున్నారు.