Biker Trailer | టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్’ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో భారీ హల్చల్ సృష్టిస్తోంది. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇండియన్ సినిమాల్లో అరుదుగా చూసే జానర్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలో శర్వానంద్ ‘విక్కీ’ అనే రేసర్ పాత్రలో స్టైలిష్ మేకోవర్‌తో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే విజువల్స్, రేసింగ్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బైక్ రేసింగ్ అంటే ప్రాణం పెట్టే ఒక యువకుడు తన లక్ష్యం కోసం చేసే పోరాటాన్ని దర్శకుడు ఎమోషనల్‌గా చూపించబోతున్నట్లు అర్థమవుతోంది.
ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ రాజశేఖర్ పోషించిన తండ్రి పాత్ర. శర్వానంద్-రాజశేఖర్ మధ్య వచ్చే సన్నివేశాలు ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. తండ్రీకొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలకంటే, వారి మధ్య జరిగే ఇగో క్లాష్ కథకు కీలకంగా కనిపిస్తోంది. “నువ్వు అందరికంటే ముందు రాలేదు.. అందరూ నీకంటే వెనుక వచ్చారు” వంటి డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టెక్నికల్ పరంగా కూడా సినిమా బలంగా కనిపిస్తోంది. సంగీత దర్శకుడు గిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత ఎలివేషన్ ఇచ్చింది. “బైకర్ అంటే స్పీడ్ కాదు.. రెస్పెక్ట్” అనే డైలాగ్ సినిమా థీమ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. రేసింగ్ కేవలం వేగం మాత్రమే కాకుండా క్రమశిక్షణ, గౌరవం కూడా అవసరమని ఈ చిత్రం చెప్పబోతుందని అర్థమవుతోంది.
ఇక హీరోయిన్గా మాళవిక నాయర్ నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కుల్కర్ణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శర్వానంద్ ఈ పాత్ర కోసం ఫిజికల్‌గా చేసిన కష్టం కూడా ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ఇచ్చిన ఇంపాక్ట్ చూస్తుంటే, శర్వానంద్ కెరీర్లో ఇది ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితమైన ఈ ‘బైకర్’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ముందుకు సాగుతోంది.