Anchor | గ్లామర్ ఇండస్ట్రీలో పెళ్లి, రిలేషన్‌షిప్‌లు నటీమణుల కెరీర్‌పై ప్రభావం చూపుతాయనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా హీరోయిన్లు, యాంకర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించాలనుకునే మహిళలకు వ్యక్తిగత జీవితం కూడా కొన్ని సందర్భాల్లో కెరీర్‌పై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. తాజాగా ఈ అంశంపై ప్రముఖ తెలుగు యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్రవంతి తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదురైన ఒక సంఘటనను పంచుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ పెద్ద ప్రాజెక్ట్ కోసం ఆడిషన్స్ ఇచ్చానని, నటన, లుక్స్ పరంగా తాను ఎంపికయ్యాననే సంకేతాలు కూడా వచ్చాయని తెలిపింది. మేకర్స్ తనను ఆ పాత్రకు సరైన ఎంపికగా భావించారని చెప్పింది.
అయితే ఫైనల్ చర్చల సమయంలో తన వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు వచ్చాయని, తనకు పెళ్లైందా అని అడిగారని వెల్లడించింది. దానికి తాను ఎలాంటి సంకోచం లేకుండా “అవును, నాకు పెళ్లైంది” అని నిజాయితీగా సమాధానం చెప్పానని తెలిపింది. కానీ ఆ విషయం చెప్పిన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయిందని స్రవంతి పేర్కొంది. షూటింగ్ కోసం చెన్నై రావాలని, అక్కడ అడ్వాన్స్ తీసుకోవాలని ముందుగా చెప్పినట్లు గుర్తు చేసుకుంది. అయితే పెళ్లి విషయం తెలిసిన తర్వాత కొద్దిసేపట్లో కాల్ చేస్తామని చెప్పిన వారు తిరిగి స్పందించలేదని తెలిపింది. ఆ తర్వాత ఆ సినిమా అవకాశం తనకు రాలేదని, తర్వాత ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందని తెలిసిందని చెప్పుకొచ్చింది.
స్రవంతి చొక్కారపు చిన్న యూట్యూబ్ ఛానెళ్లలో యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అనంతరం ప్రముఖ హీరోల ఇంటర్వ్యూలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఒక స్టార్ హీరో సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూతో ఆమెకు భారీ పాపులారిటీ వచ్చింది. తర్వాత తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాన్-స్టాప్‌లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం సినిమా ఆడియో లాంచ్‌లు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, ప్రత్యేక కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. ఇటీవల నటిగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించిన స్రవంతి, సోషల్ మీడియాలో కూడా తన గ్లామరస్ ఫోటోషూట్లతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది.