యానిమేషన్ రంగంలో తనదైన గుర్తింపును సంపాదించుకున్న గ్రీన్ గోల్డ్ గ్రూప్ సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నది. చిలకా ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలను తెరకెక్కించనుంది. ఇటీవల ఈ సంస్థ బ్యానర్ లోగోను అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, శరత్ మరార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత రాజీవ్ చిలకా మాట్లాడుతూ ‘డిస్నీ వరల్డ్ మాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంటుంది.
‘లయన్ కింగ్’ సినిమా చూసి అలాంటి సినిమా ఇండియాలో ఎందుకు చేయకూడదూ?.. అనిపించింది. యానిమేషన్ రంగంలో చాలా కష్టపడుతూ పైకొచ్చాం. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల చిత్రాన్ని నిర్మిస్తున్నా. మరికొన్ని ప్రాజెక్ట్స్ సన్నాహక దశలో ఉన్నాయి’ అన్నారు. ఇప్పటివరకు 116 యానిమేషన్ చిత్రాల్ని నిర్మించిన తమ సంస్థ సినీ నిర్మాణంతో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నదని శ్రీనివాస్ చిలకా తెలిపారు. ఈ బ్యానర్ సినీ రంగంలో విజయవంతం కావాలని అల్లు అరవింద్ ఆకాంక్షించారు.