Actress Shreya Dhanwanthary | ప్రముఖ నటి కృతిసనన్ నటించిన రక్షాబంధన్ ప్రకటన వివాదంపై ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ నటి శ్రేయా ధన్వంతరి స్పందించింది. ఈ వివాదంలో కృతిసనన్‌కు మద్దతు తెలుపుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.
జీవా (GIVA) జ్యువెలరీ బ్రాండ్ కోసం కృతిసనన్ నటించిన రక్షాబంధన్ యాడ్‌లో ఆమె ధరించిన దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పండుగ రోజు బికినీ లేదా ఇన్నర్ వేర్ లాంటి దుస్తులు ధరించి రాఖీ కట్టడం ఏంటని కంగనా ప్రశ్నించగా, దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. అయితే ఈ వివాదంపై స్పందించిన శ్రేయా ధన్వంతరి.. దేశంలో అంతకంటే తీవ్రమైన సమస్యలు ఎన్నో ఉన్నాయని, కేవలం ఒక దుస్తుల నెక్-లైన్ విషయంలో ఇంతగా రచ్చ చేయడం సరికాదని మండిపడ్డారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం దేశంలో ఉన్న వాస్తవాలను ప్రస్తావిస్తూ ఆమె కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు. మన దేశంలో రోడ్లు, మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, కానీ ఆ సమస్య కాదని మనకి భాషా రుద్దుడు లాంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాగే కనీసం విచారణ కూడా జరగకుండా ఎంతోమంది రాజకీయ ఖైదీలు ఇంకా జైళ్లలోనే మగ్గుతుంటే, మరోవైపు రేప్ చేసి పేరుమోసిన నేరస్థులకు మాత్రం సులభంగా బెయిల్ లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరిగే నేరాలు ఏమాత్రం తగ్గడం లేదని, ఇన్ని సమస్యలు కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ కేవలం ఒక దుస్తుల విషయంలో ఇంత రచ్చ చేయడం హాస్యాస్పదంగా ఉందని శ్రేయా ధన్వంతరి విమర్శించారు.
Our roads and infrastructure are crumbling. Language imposition takes priority.
A known criminal gets bail while several political prisoners are still in jail without trial.
Crimes against women haven’t stopped or reduced but priority outrage is made over a neckline.
— Shreya Dhanwanthary (@shreyadhan13) August 26, 2026