AadarshaKutumbam Review | ‘ఆదర్శకుటుంబం – హౌస్ నెం. ఏకే 47’ రివ్యూ.. వెంకటేశ్ – త్రివిక్రమ్ సినిమా ఎలా ఉందంటే!
AadarshaKutumbam | నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల తర్వాత వెంకటేశ్, త్రివిక్రమ్ కలిసి పనిచేసిన సినిమా కావడంతో కొబ్బరికాయ కొట్టిన నాటినుంచీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి.
సినిమాపేరు : ఆదర్శకుటుంబం – హౌస్ నెం. ఏకే 47
తారాగణం: వెంకటేశ్, శ్రీనిధిశెట్టి, నారా రోహిత్, రావురమేశ్, సచిన్ ఖేకేకర్, సత్య, నివేదా పేతురాజ్..
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం: తమన్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ
నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల తర్వాత వెంకటేశ్, త్రివిక్రమ్ కలిసి పనిచేసిన సినిమా కావడంతో కొబ్బరికాయ కొట్టిన నాటినుంచీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. వాటికి తగ్గట్టుగా టైటిల్ దగ్గర్నుంచి ప్రచార చిత్రాలన్నీ ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. సినిమా విషయంలో మేకర్స్ రాజీ పడని కారణంగా, పలు విడుదల తేదీలు కూడా మారుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘ఆదర్శకుటుంబం’ విడుదలైంది. మరి అందరి అంచనాలనూ నిజం చేస్తూ విజయం సాధించిందా? వెంకటేశ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్ మళ్లీ మ్యాజిక్ చేసిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
చిట్టిబాబు ఓ మధ్యతరగతి వ్యక్తి. అతనికి ఓ భార్య, వయసుకొచ్చిన కూతురు, పదేళ్ల కొడుకు ఉన్నారు. కొడుక్కి గుండె జబ్బు. భార్య చిట్‌ఫండ్‌లో డబ్బులు పోగొట్టి, ఇంటిని అప్పుల పాలు చేసింది. సినిమా కష్టాలన్నీ చుట్టుముట్టి సతమతమవుతున్న చిట్టిబాబుకు, గోరుచుట్టుకు రోకలిపోటు అన్నట్టు, ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఇక బతుకు బండిని ఈడ్చేదెలాగా? అని చిట్టిబాబు ఆలోచిస్తున్న సమయంలో అనుకోని అదృష్టంలా లాటరీలో చిట్టిబాబుకి వందకోట్లు వచ్చిపడ్డాయి. దాంతో 20కోట్ల విల్లాలోకి చిట్టిబాబు ఫ్యామిలీ షిఫ్టయ్యింది. సిటీ అంతా ‘వందకోట్ల విజేతలు’ అంటూ చిట్టిబాబు ఫ్యామిలీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ప్రచారం పుణ్యమా అని, చిట్టిబాబు కుటుంబంపై బీహార్ దొంగల ముఠా కన్ను పడింది. వాళ్లు నరరూప రాక్షసులు. డబ్బు దొంగిలించడంతోపాటు మనుషుల్ని కూడా పాశవికంగా చంపడం ఆ ముఠా నైజం. ఓ రాత్రి చిట్టిబాబు ఇంటిలోకి ఆ ముఠా చొరబడ్డారు. డబ్బును దొంగిలించి, మనుషులపై దాడి చేసేందుకు వాళ్లు తెగబడుతున్న తరుణంలో, ఉన్నట్టుండి ఆ ముఠాపై చిట్టిబాబు ఫ్యామిలీ విరుచుకు పడింది. ఇంట్లోకి చొరబడ్డ ఆరుగురు హంతకుల్నీ చిట్టిబాబు ఫ్యామిలీ అతి కిరాతకంగా చంపింది. చివరకు వాళ్ల శవాల ఆనవాళ్లు సైతం కనబడకుండా చేసింది. ఈ ఊహించని పరిణామంతో అటు పోలీసులకూ, ఇటు బీహార్ గ్యాంగ్‌కీ చిట్టిబాబు ఫ్యామిలీ అర్థంకాని ప్రశ్నయింది. అసలు ఈ చిట్టిబాబు ఎవరు? అతని ఫ్యామిలీ కథేంటి? తమపై పగబట్టిన బీహార్ గ్యాంగ్ నుంచి చిట్టిబాబు ఫ్యామిలీ ఎలా బయటపడింది? చివరకు పోలీసులు ఈ కథలో ఏం తేల్చారు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
ఓ న్యాయమూర్తి రాసిన తీర్పు, సంబంధం లేని నలుగుర్ని కలిపింది. ఆ నలుగురు ఒకరికోసం ఒకరు బతికేలా చేసింది. ఒకరికోసం ఒకరు ఎంతకైనా తెగించేలా చేసింది. ఎలాంటి సంబంధం లేకపోయినా తాము ఓకే కుటుంబం అని వాళ్లు మానసికంగా ఫీలయ్యేలా చేసింది. ఓ యాభై ఏండ్ల క్రితం దాదాపుగా ఇదే లైన్లో శోభన్‌బాబు ‘ఖైదీ బాబాయి’ సినిమా వచ్చింది. అదే లైన్ చుట్టూ ఆసక్తికరమైన కొత్త కథనాన్ని అల్లి ఓ వినూత్న కుటుంబకథను తెరకెక్కించారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అద్భుతంగా మాటలు రాయడం, వినోదంతోపాటు మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలతో కథను నడిపించడం త్రివిక్రమ్ శైలి. ఈ సినిమా విషయంలోనూ ఆయన అదే మ్యాజిక్ చేశారు. అయితే.. ప్రథమార్థంలో నటీనటులంతా ఒకేలా ప్రవర్తించడం, ఎవరికి వాళ్లు తెలివిగల వాళ్లలా ఫీలవ్వడం, అందరూ సెటైర్లు వేయడం కాస్త ఇబ్బందిగా అనిపించినా, త్రివిక్రమ్ తనదైన హ్యూమర్‌తో విసుగు లేకుండా సినిమాను నడిపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ చాలాబావుంది. అందులో సత్య కామెడీ ఇంకా బావుంది. ఇంటర్వెల్ కార్డ్ పడగానే అంతా నవ్వులతో బయటకొచ్చారు. ఇక ద్వితాయార్ధం అంతా చిక్కుముడుల్ని విప్పుకుంటూ, ప్రేక్షకుడి మనసుల్లో నెలకొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ తెలివైన కథనంతో కథను నడిపించారు త్రివిక్రమ్. బీహార్ దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు హీరో కుటుంబాన్ని పావుల్లా వాడటం, కానీ పోలీసుల్నే వాళ్లు ఫూల్స్‌ని చేస్తూ ముందుకు సాగడం, ఇలా టామ్ అండ్ జెర్రీ తరహాలో సాగిన కథనం ఆసక్తికరంగా అనిపిస్తుంది. త్రివిక్రమ్ గత సినిమాలతో పోలిస్తే క్రైమ్ పాళ్లు కూడా ఈ సినిమాలో ఎక్కువే. అయినా ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడొచ్చు. ఎక్కడా విసుగు అనిపించదు.
నటీనటులు
వెంకటేశ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన అద్భుతమైన నటుడు. తదావిధిగా ఈ సినిమాలోనూ తను అద్భుతంగా నటించారు. హాస్యం, యాక్షన్, ఎమోషన్స్.. ఇలా అన్ని విషయాల్లోనూ అదరహో అనిపించారు. శ్రీనిధిశెట్టిది ఇందులో సాధారణ హీరోయిన్ పాత్ర కాదు. చాలా భిన్నమైన పాత్ర. తను కూడా హ్యామర్తోపాటు యాక్షన్, ఎమోషన్స్ కూడా ఇరగదీసేసింది. తెరపై చాలా అందంగా కూడా ఉంది. మిగతావారంతా పరిధిమేర రక్తికట్టించారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోదగిన ఇద్దరు నటుడు రావురమేశ్, సత్య. పదికోట్ల రివార్డు కోసం హీరో కుటుంబాన్ని బీహార్ గ్యాంగ్‌కి ఎరగా వేసిన పోలీస్‌గా రావురమేశ్ ఇందులో అద్భుతంగా నటించాడు. అతని డైలాగ్ డెలివరీ, నటన ఆయన తండ్రిగారైన రావుగోపాలరావుని గుర్తు చేసింది. ఇక సత్య అయితే తనదైన కామెడీ టైమింగ్‌తో థియేటర్లో నవ్వులు పూయించాడు. నివేదా పేతురాజ్ సినిమాకు ఓ అదనపు ఆకర్షణ.
సాంకేతికంగా
త్రివిక్రమ్ ఎప్పటిలాగే స్క్రిప్ట్ బాగా రాసుకున్నారు. బాగా నవ్వించారు. కథనం విషయంలో అక్కడక్కడ కాస్త స్లో అయిన ఫీలింగ్ తప్ప, మిగతా అంతా బావుంది. ఇక తమన్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్ని తీసుకొచ్చాయి. చాయాగ్రహణం, ఎడిటింగ్.. టెక్నికల్‌గా టీమ్ అంతా సమర్ధవంతంగా పనిచేశారు. మొత్తంగా కుటుంబ ప్రేక్షకులకే కాదు, మాస్ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చే అవకాశాలున్నాయి.
బలాలు
వెంకటేశ్, రావురమేశ్, సత్య నటన, త్రివిక్రమ్ స్క్రిప్ట్, తమన్ సంగీతం..
బలహీనతలు
ప్రథమార్ధం అక్కడక్కడ సినిమా కాస్త స్లోగా నడవడం
రేటింగ్ 3/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

