Credit Card ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో హోం అప్లయెన్సెస్.. లాప్‌టాప్‌లు.. స్మార్ట్ ఫోన్లు.. వివిధ రకాల డ్రస్‌లు, ఫుట్‌వేర్.. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంటారు. వీటిని కొనుగోలు చేసే వారిని క్రెడిట్ కార్డులు పలు రకాల రాయితీలతో ఆకర్షిస్తుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. మన ఆదాయాన్ని మించి ఖర్చు చేసేలా ఆఫర్లు, ఆప్షన్లు ఊరిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన దగ్గర క్యాష్ లేకున్నా క్రెడిట్ కార్డుతో ఇంట్లో అవసరమైన వస్తువులు కొనుగోలు చేయొచ్చు. బిల్లు చెల్లించే కెపాసిటీ లేకుంటే.. ఈఎంఐలు ఉండనే ఉన్నాయి. ఈ తరహా కొనుగోళ్లు ప్రోత్సహించడానికి క్రెడిట్ కార్డు కంపెనీలు సైతం రకరకాల ఆఫర్లు అందుబాటులోకి తెస్తున్నాయి. వాటిల్లో క్యాష్‌బ్యాక్, ఈఎంఐ, బై నౌ పే లేటర్ వంటి ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లు, బెనిఫిట్లు వినడానికి కాస్త ఆకర్షణీయంగా ఉన్నా.. ఆచరణలో అంటే చెల్లింపుల్లో ఇబ్బందులు ఫేస్ చేయాల్సిందే. సౌలభ్యాల మాటున ఉన్న సీక్రేట్స్ తెలుసుకోకుంటే మన పర్సులు ఖాళీ అవుతాయి..
భారీ మొత్తంలో వస్తువులు.. ఫ్రిజ్.. వాషింగ్ మిషన్, హోం థియేటర్ వంటివి కొనుగోలు చేసినప్పుడు వాయిదాల్లో చెల్లింపులు సౌకర్యవంతంగా ఉంటది. హోంలోన్, పర్సనల్ లోన్ పేమెంట్లాగే ఉంటది. ఇప్పటికిప్పుడు మన దగ్గర క్యాష్ లేనప్పుడు రిలీఫ్ ఇచ్చే విషయం. కానీ క్రెడిట్ కార్డు కంపెనీలు ఎల్లవేళలా ఈఎంఐ ఫెసిలిటీ కల్పించకపోవచ్చు.. కొన్ని సెలెక్టెడ్ దుకాణాలు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కొనుగోళ్లపై మాత్రమే ఈఎంఐ ఆప్షన్ ఇవ్వవచ్చు.
ఇక క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై చెల్లింపులు నెలసరి వాయిదాలు (ఈఎంఐ)గా మార్చుకున్నాం అనుకోండి. పేమెంట్స్ పూర్తయ్యే సరికి ప్రతి నెలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆయా ఖాతాదారులను బట్టి స్టాండ్డర్ ఛార్టర్డ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు జీరో నుంచి 1.99 శాతం వడ్డీ వరకూ వసూలు చేస్తాయి. ఈ లోన్లకు ఎటువంటి పత్రాలు అవసరం లేదు. కానీ, ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునే ముందు ఆయా బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు సంస్థ వసూలు చేసే వడ్డీ, ఇతర డిటైల్స్ ఆయా సంస్థల యాజమాన్యాలతో సంప్రదించడం మరిచిపోవద్దని నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డు వాడుకున్న వారు నిర్దిష్ట గడువు లోగా బిల్లు చెల్లించాల్సిందే. అలా చెల్లించకపోతే అనవసర చార్జీలు పే చేయాల్సి వస్తుంది. బ్యాంకులు 30 నుంచి 40 శాతం వరకు వార్షిక వడ్డీ వసూలు చేస్తాయి. సమయం ప్రకారం క్రెడిట్ కార్డు బిల్లు పే చేయకుంటే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం ఉంటుంది. కనుక క్యాష్ లేనప్పుడు క్రెడిట్ కార్డు బిల్లులను ఈఎంఐకి మళ్లించవచ్చు.
అయితే ఈఎంఐ ఆప్షన్ వాడుకున్నంత కాలం.. సదరు క్రెడిట్ కార్డు గరిష్ట పరిమితికి అనుగుణంగా వినియోగించుకోలేం. ఉదాహరణకు మీ కార్డు లిమిట్ రూ.68 వేలు ఉందనుకుందాం.. ఒక ఫ్రిజ్ తీసుకుంటే రూ.34 వేలు ఖర్చయి పోయింది. ఈ బిల్లు ఈఎంఐగా మార్చుకుంటే మిగతా రూ.34 వేల వరకు మాత్రమే కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుంది. ప్రతి నెలా ఈఎంఐ పేమెంట్స్‌కు అనుగుణంగా వాడకం లిమిట్ కూడా పెరుగుతుంది.
జీరో ఇంటరెస్ట్ అని సూత్రప్రాయంగా చెప్పినా.. డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్ ఫీజు తదితర పేర్లతో బ్యాంకులు కొంత మొత్తం చార్జీలు వసూలు చేస్తాయి. గడువు తీరక ముందు బాకీ మొత్తం చెల్లింపుపై మూడు శాతం వరకు ఫీజు వసూలు చేస్తాయి. కనుక మీకు అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్లను వాడుకోవడం బెటర్.
కొన్నిసార్లు బ్యాంకులు, క్రెడిట్ కార్డుల జారీ సంస్థలు తమ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లపై 10 శాతం వరకూ డిస్కౌంట్లు ఇస్తాయి. ఇది క్యాష్ బ్యాక్ ఆఫర్లాంటిదే. ఈ తరహా ఆఫర్లతో జరిపే కొనుగోళ్ల బిల్లు చెల్లింపులు ఈఎంఐ ఆప్షన్ కింద మార్చుకోవచ్చు. అలాగని.. ఈ ఆఫర్ల కోసం కాకుండా కుటుంబ అవసరాలను బట్టి కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డు బిల్లులను ఈఎంఐగా మార్చుకుంటే ప్రతి నెలా ఈఎంఐ తప్పనిసరిగా చెల్లించవల్సిందే. ఒక్కసారి కూడా చెల్లించకపోయినా అధిక మొత్తం రుసుము వర్తిస్తుంది. కొన్ని బ్యాంకులు మిగిలిన మొత్తం బాకీ.. సాధారణ కార్డు బిల్లుగా మార్చేసి తదుపరి నెల బిల్లులో కలిపేసి పంపుతాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లోనే క్రెడిట్ కార్డు వాడాలి.. అవకాశం ఉందని ఈఎంఐ ఆప్షన్లు వాడుతూ వెళితే.. కుటుంబ ఫైనాన్సియల్ ప్లానింగ్ దెబ్బ తింటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.