Realme P4R 5G : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ముఖ్యంగా మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుందని బాధపడేవారికి రియల్మీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సరికొత్త సాంకేతికతతో, కళ్లు చెదిరే ఫీచర్లతో రియల్మీ Realme P4R 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్లో ఏకంగా 8,000mAh బ్యాటరీని అమర్చారు. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ కేవలం 8.8 mm మందంతో చాలా స్లిమ్‌గా ఉండటం విశేషం. యువతను, గేమర్లను టార్గెట్ చేస్తూ రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో ఈ మిడ్-రేంజ్ ఫోన్‌ను కంపెనీ డిజైన్ చేసింది.
ఈ ఫోన్ ధర రూ.18,999 నుంచి ప్రారంభమవుతోంది. మూడు వేరియంట్లలో లభించే ఈ ఫోన్ ల్యావెండర్ గ్లేర్, సిల్వర్ గ్లేర్, టైటానియం గ్లేర్ రంగుల్లో లభిస్తుంది. 4GB రామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.18,999, 6GB రామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.20,999, అదేవిధంగా 6GB రామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను రియల్మీ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లోని 8,000mAh బ్యాటరీకి తోడుగా 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణంగా వాడేవారికి ఏకంగా 3 రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే నాన్‌స్టాప్‌గా 12.5 గంటల పాటు ఫ్రీ ఫైర్ గేమ్, 26.9 గంటల నావిగేషన్, 21.6 గంటల యూట్యూబ్ వీడియోలు, 6.5 రోజులపాటు నిరంతరాయంగా మ్యూజిక్ ప్లేబ్యాక్ ఆనందించవచ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను వాడారు. గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి 5,300 చదరపు మిల్లీమీటర్ల విస్తీర్ణం కలిగిన వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు.
ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 16 బేస్డ్ రియల్మీ UI 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 6.8 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో పాటు స్మూత్ గేమింగ్ కోసం 144Hz రీఫ్రెష్ రేట్ ఇవ్వడం విశేషం. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ మెయిన్ ఏఐ కెమెరాతోపాటు సెకండరీ లెన్స్ ఉంది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్‌పై నోటిఫికేషన్ల కోసం ప్రత్యేకంగా ‘ఏఐ పల్స్ లైట్’ అనే లైటింగ్‌ను ఇచ్చారు. దీన్ని యూజర్లు తమకు నచ్చినట్లు 9 రంగుల్లో, 5 రకాల స్పీడ్ సెట్టింగ్స్‌తో కస్టమైజ్ చేసుకోవచ్చు.