తగ్గనున్న ఎల్టీసీజీ?
స్టాక్ మార్కెట్ మదుపర్ల కోసం దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను (ఎల్టీసీజీ) విధానం పునర్వ్యవస్థీకరణను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. పన్ను తగ్గింపుపై వ్యాపార-పారిశ్రామిక వర్గాలు, క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), బ్యాంకులు, ఇతర భాగస్వాములతో సమావేశాలూ జరుగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
- పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం
- జరుగుతున్న చర్చలు.. త్వరలో నిర్ణయం
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: స్టాక్ మార్కెట్ మదుపర్ల కోసం దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను (ఎల్టీసీజీ) విధానం పునర్వ్యవస్థీకరణను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. పన్ను తగ్గింపుపై వ్యాపార-పారిశ్రామిక వర్గాలు, క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), బ్యాంకులు, ఇతర భాగస్వాములతో సమావేశాలూ జరుగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొద్దివారాల్లో ఓ నిర్ణయం వెలువడుతుందని సదరు అధికారి చెప్తున్నారు. దీంతో వచ్చే ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించి అమల్లోకి తేవచ్చన్న అంచనాలున్నాయి.
ఇదీ సంగతి..
వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు, పెద్ద ఎత్తున తరలిపోతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల మధ్య ఎల్టీసీజీ సమీక్ష మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నదిప్పుడు. పైగా ఈ నెల 13న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఎల్‌టీసీజీని ఎత్తివేయాలన్న అభిప్రాయాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నట్టు కూడా చెప్పారు. ఈ క్రమంలో విదేశీ మదుపర్లను ఆకట్టుకొని.. అంతర్జాతీయంగా భారతీయ ఈక్విటీ మార్కెట్‌ను మరింత పోటీయుతంగా మార్చడానికి పన్నులను తగ్గించడమే ప్రధానమని మోదీ సర్కార్ యోచిస్తున్నట్టు అంటున్నారు.
ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన షేర్లలో పెట్టిన పెట్టుబడులకు పొందిన దీర్ఘకాల లాభాలపై ఎల్టీసీజీ 12.5 శాతంగా ఉన్నది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ లాభాలు రూ.1.25 లక్షలు దాటితేనే వర్తిస్తున్నది. కానీ ఇండెక్సేషన్ (పెరిగే ద్రవ్యోల్బణం) ప్రయోజనాలుండవు. దేశ, విదేశీ మదుపర్లందరికీ ఇదే లెక్క. అలాగే స్టాక్ మార్కెట్లలో నమోదుకాని షేర్లలో పెట్టిన పెట్టుబడులపై పొందే లాభాలకూ ఎల్టీసీజీ చెల్లించాల్సిందే. ఇక్కడ రూ.1.25 లక్షల మినహాయింపు వర్తించదు.
డాలర్ లాభాలపైనే ట్యాక్స్?
విదేశీ మదుపర్లకు వర్తించే ఎల్టీసీజీనే తగ్గిస్తారని సమాచారం. భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రూ.3.1 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. గత ఏడాది మొత్తంగా వెనక్కి తీసుకున్న పెట్టుబడులు 1.7 లక్షల కోట్లేనని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) గణాంకాలు చెప్తున్నాయి. ఇది.. గ్లోబల్ మార్కెట్‌కు భారత్ పెట్టుబడులకు అనువైనది కాదన్న సంకేతాలనిస్తున్నదని కేంద్రం భావిస్తున్నది. పన్ను విధానాలను మార్చాలని, ముఖ్యంగా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తున్న నేపథ్యంలో డాలర్ లాభాలపైనే పన్ను వేయాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
విదేశాల్లో పన్నులు ఇలా..
అమెరికాలో వివిధ షరతులకు లోబడి విదేశీ మదుపర్లకు మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉన్నది. అలాగే బ్రిటన్, సింగపూర్, హాంకాంగ్, యూఏఈ, జపాన్, కెనడాల్లోనూ కొన్ని పరిస్థితుల్లో విదేశీ ఇన్వెస్టర్లకు పన్నులు పడటం లేదు. ఇక పొరుగు దేశం చైనా కొన్ని షేర్లపై పెట్టిన పెట్టుబడుల్లో పొందే లాభాలకు ఈ పన్నును విధించడం లేదు. మిగతా వాటికి 10 శాతం పన్ను ఉంటున్నది. దీంతో ఆయా దేశాల తరహాలోనే భారత్‌లోనూ ఎల్టీసీజీ విధానాన్ని మార్చాలని ప్రభుత్వం అనుకుంటున్నట్టు చెప్తున్నారు.
పైగా మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో పెరుగుతున్న ముడి చమురు ధరలు.. దేశంలో ఉన్న డాలర్ నిల్వలను నానాటికీ కరిగించేస్తున్నాయి. ఇప్పటికే డాలర్ల కోసం ఆర్బీఐ నానా తిప్పలు పడుతున్నది చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పన్నుల భారంతో విదేశీ మదుపర్లు దూరమైతే పరిస్థితులు ఇంకా దిగజారుతాయన్న ఆందోళన పాలక వర్గంలో కనిపిస్తున్నది. అందుకే భారతీయ ఈక్విటీ మార్కెట్లను విదేశీ మదుపర్లకు పన్ను తగ్గింపులతో ఆకర్షణీయంగా మార్చాలని మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నది. చివరిసారిగా 2024 జూలైలో ఎల్‌టీసీజీని 10 శాతం నుంచి 12.5 శాతానికి కేంద్రం ప్రభుత్వం మార్చిన సంగతి విదితమే.
ఉదాహరణకు..
2024లో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఓ విదేశీ మదుపరి 100 డాలర్లను పెట్టుబడిగా పెట్టాడు. అప్పుడు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.80గా ఉన్నది. దీంతో ఆ మొత్తం పెట్టుబడి విలువ రూ.8,000 అయ్యింది. అయితే 2026లో ఆ మదుపరి తన పెట్టుబడులను ఉపసంహరించుకున్నాడు. రూ.8,800 వచ్చాయి. కానీ రూపాయి విలువ రూ.88గా ఉన్నది. దీంతో సదరు విదేశీ మదుపరికి చివరికి 100 డాలర్లే అందాయి. పైగా ఎల్టీసీజీకి రూపాయల్లో కనిపిస్తున్న లాభాలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.
ఫలితంగా ఈ రెండేండ్లలో రూ.800 లాభం వచ్చిందని 10 డాలర్లదాకా ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చింది. ఫలితంగా 100 డాలర్ల పెట్టుబడికి మదుపరికి మిగిలింది 90 డాలర్లే. దేశీయ మార్కెట్లో లాభం కనిపించినా.. పడిపోతున్న రూపాయి విలువతో అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం అది నష్టంగానే ఉంటున్నది. దీనిపైనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. అందుకే దేశీయ మదుపర్లకు ఎప్పట్లాగే రూపాయల్లో కనిపిస్తున్న లాభాలపైనే ట్యాక్స్ వేసినా.. విదేశీ మదుపర్లకు మాత్రం రూపాయి మారకం విలువ ప్రకారం డాలర్ లాభాలపైనే ఎల్‌టీసీజీని వర్తింపజేయాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

