న్యూఢిల్లీ, అక్టోబర్ 8 : విమాన చార్జీలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇంధన సర్చార్జి పేరుతో ఇప్పటికే పలు విమానయాన సంస్థలు టికెట్ ధరలు పెంచగా..తాజాగా ఈ జాబితాలోకి ఎయిర్ ఇండియా, ఏఐ ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్ కూడా చేరాయి. ఈ మూడు సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో దేశీయంగా ప్రయాణించేవారితోపాటు అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించేవారిపై ఆర్థిక భారం పడనున్నది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ప్రపంచ ఇంధన మార్కెట్లో నిరంతర ఒత్తిడి కారణంగా ఇటీవల కాలంలో విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుదలు చోటు చేసుకున్నాయని, ఈ కారణంగా విమానయాన సంస్థలపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా సర్చార్జిను సవరించాల్సి వచ్చిందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది.
దేశీయ విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్చార్జిని రూ.400 నుంచి రూ.1,200 వరకు విధించిన సంస్థ..అంతర్జాతీయ రూట్లలో 55 డాలర్ల నుంచి 215 డాలర్ల వరకు విధించింది. అలాగే ఆకాశ ఎయిర్ కూడా సర్చార్జిని విధించింది. దేశీయ విమాన టికెట్లపై రూ.375 నుంచి రూ.1,150 వరకు విధించిన సంస్థ..అంతర్జాతీయ రూట్లపై రూ.2,500 వసూలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విధింపు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నట్టు ఈ మూడు సంస్థలు ప్రకటించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు భారీగా పుంజుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో ఇంధన సర్చార్జి విధించక తప్పడం లేదని ఆకాశ ఎయిర్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం విమానయాన సంస్థల నిర్వహణలో 40 శాతం ఇంధనం కోసం వెచ్చించడంతో సంస్థ నిర్వహణ కష్టంగా మారుతున్నదని, దీంతో టికెట్ ధరలు పెంచకతప్పడం లేదని తెలిపారు.