ప్రేమ… ఇష్క్.. లవ్.. కాదల్… పురాణ కాలం నుంచీ ఉన్నవే! ఈశ్వరుడి ప్రేమ కోసం పార్వతి తపస్సు చేసింది. రాధ ప్రేమకై కృష్ణుడు పరితపించాడు. చరిత్రకొస్తే.. లేటు వయసులోనూ చిగురించిన ఎన్నో ఘాటు ప్రేమలు కనిపిస్తాయి. ఈ ప్రేమలన్నిటికన్నా, వెండితెరపై వండి వడ్డించిన ప్రేమకథలే… సమాజంపై తీవ్ర ప్రభావం చూపించాయన్నది కాదనలేని సత్యం. ఆ చిత్రాల్లో కవిపండితులు పండించిన గీతాలు.. కరకు గుండెకూ ప్రేమ చురుకు తగిలించాయి. సాదాసీదా సినిమాల్లో సైతం ‘ప్యార్ హువా.. ఇక్రార్ హువా..’ అని నినదించిన సినీ కవులు, ఫక్తు లవ్‌స్టోరీస్‌లో కామ్‌గా ఉంటారా? కదనకుతూహల రాగమంత వేగంగా కాదల్ గీతికలను అందించారు. ఆనాటి ‘బాలరాజు’ నుంచి నిన్నమొన్నొచ్చిన ‘గుంటూరు కారం’ వరకు ఎన్నో సినిమా పాటలు.. వలపు పాఠాలై ప్రేమ పావురాలకు రెక్కలు తొడిగాయి. రానున్న ప్రేమికుల రోజు సందర్భంగా లవ్ గీతోపదేశాన్ని ఆలకిద్దాం…
Valentine’s day | ‘ప్రేమ రా! కృష్ణా! ఎంతపనైనా చేయిస్తుంది’ అని వివాహ భోజనంబు సినిమాలో నూతన్‌ప్రసాద్ పాత్ర తన కొడుకుతో చెప్పే డైలాగ్ ఇది. అవును ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది. ‘నిజం చెప్పమంటారా.. అబద్ధం చెప్పమంటారా’ అని చేతులు కట్టుకొని వినయంగా పలికిన తోటరాముడు ‘ప్రేమ కోసమే’ కదా.. నేపాల మాంత్రికుడి వలలో పడింది. ప్రేమ కిక్కు ఎక్కినవారికి చిక్కులకేం తక్కువుండదు. అయితే, వాటన్నిటినీ అధిగమించే శక్తియుక్తులను సినిమా పాటలే అందించాయి, అందిస్తున్నాయి. ప్రేమ చిగురించేలా.. చిగురించిన ప్రేమను వ్యక్తపరిచేలా.. వ్యక్తీకరించిన ప్రేమను నిలుపుకొనేలా.. నిలిచిన ప్రేమను గెలిచేలా.. ఇలా ప్రేమ పురాణంలోని ప్రతి పర్వంలోనూ సినిమా పాట కొత్త బాట పరుస్తుంది. దైనందిన జీవితంలో సినిమాల్లోలా ప్రేమికులు యుగళ గీతాలు పాడుకోరు! కానీ, ప్రేమగీతాలను మాత్రం జంటగా ఆస్వాదిస్తారు. కొంటెగా కంటి సైగలు చేసుకుంటూ వింటారు. సందర్భోచితంగా లవ్సాంగ్స్ను డైలర్ టోన్స్గా పెట్టుకునే వాళ్లు కొందరైతే, వాట్సప్ స్టేటస్‌లో తన ప్రేమను వెల్లడించేవారు ఇంకొందరు.
నచ్చిన కుర్రాడు కంటపడగానే కాస్త నోస్టాలజీ టేస్ట్ ఉన్న చిన్నదానికి ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..’ అని మధ్యమావతి రాగంలో మదిలో ఏవేవో కదలాడుతాయి. కంటికి నజర్గా కనిపించింది తన జానేజిగర్ అని నమ్మిన వాడు ‘మాటే మంత్రమూ.. మనసే బంధమూ..’ అని ఊహల్లోకి వెళ్లిపోవడం ఖాయం. ఈ తరం పిల్లగాడైతే.. ‘సామజవర గమనా.. నిను చూసి ఆగగలనా..’ అని లోలోపల పాటందుకొని ‘చూపే సింగారమాయనే.. శ్రీవల్లి’ అని బయటకు అనేస్తాడు. ప్రేమ పాటల్లో మత్తు అలాంటిది. పింగళి వారి పాళి నుంచి ఎన్ని అను‘రాగాలు’ పురుడుపోసుకోలేదు! ఆయనగారన్న ‘అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే.. ఆడువారి మాటలకూ అర్థాలే వేరులే’ పాట ప్రేమ నిర్వచనాన్నే మార్చేసింది. ఈ ఒక్క ముక్క పట్టుకొని లెక్కకు అందనంత మంది లవ్‌లో సెటిలయ్యారు. ‘విసిగి నసిగి కసిరినచో..’ విషయం అసలు ఇష్టమే అని సూత్రీకరించుకుని పట్టువదలక ప్రయత్నించి విజేతలైన ప్రేమికులు ఎందరో! అమ్మాయి ‘ఐ హేట్ యూ..’ అన్నా.. ‘హేట్ అంటే లవ్వనిలే’ అని ఈ తరమూ తబ్బిబ్బవుతున్నది. జ్ఞాన తెలుగుకు జాణతనం నేర్పిన దేవులపల్లి గీతం ‘కుశలమా.. నీకు కుశలమేనా..’ ఆ తరం ప్రేమికుల పలకరింపును పులకరింపుగా మార్చేసింది. దాశరథి విరచిత ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతమో..’ పాట ఆనాటికే కాదు… ఈనాటికీ, మరేనాటికీ ప్రేమి‘కుల’ దైవమే!
‘చుక్కలాంటి అమ్మాయి.. చక్కనైన అబ్బాయి…’ ఇద్దరు ఒద్దికయ్యారంటే వాళ్లు కచ్చితంగా మన‘సు కవి’ ఆత్రేయను తమ ప్రేమకు ఆచార్యుడిగా భావించే ఉంటారు. ‘నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా.. జాబిలి నవ్వున నువ్వేనా.. గోదారి పొంగున నువ్వేనా..’ అని ఆత్రేయ తోటలో పూసిన పూతరేకు వంటి పాట! దీన్ని విన్న ప్రేమపక్షులు ‘పదహారేళ్లకూ నీలో.. నాలో.. ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు.. కోటి దండాలు’ పెట్టకుండా ఎలా ఉండగలరు. ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే..’ ఎలా ఉంటుందో అప్పటివరకూ ఎవరికీ తెలియని భావన. ‘చెప్పలేని ఆ హాయీ.. ఎంతో వెచ్చగ ఉంటుందోయీ..’ అని ఆత్రేయ ముక్తాయింపు ఇచ్చిన తీరు ఆయన పాటలోనే చెప్పాలంటే ‘ఈనాడే ఏదో అయ్యింది.. ఏనాడూ నాలో కలగనిది…’ అనుకోవాల్సిందే!!
ప్రేమ జంటలను పూర్తిస్థాయిలో వశపరుచుకున్న గీత రచయిత వేటూరే! పాటల పల్లకిలో ఆయన ప్రయోగించిన అలంకారాలన్నీ ప్రేమికుల పాలిట వరాలయ్యాయి. ఓ పాటలో ‘సిరిమల్లె పువ్వా.. సిరిమల్లె పువ్వా..’ అని ‘పదహారేళ్ల వయసు’న్న చిన్నారి చిలకమ్మ కోరుకునే వాడి వైనాన్ని వర్ణించాడు. మరోపాటలో ‘నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళ…’ అని ఉదాత్తమైన ప్రేమను చాటాడు. అంతలోనే ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. ’ అని మోటు ప్రేమకు పురిగొలిపాడు. ‘చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్..’ అన్న పంక్తి విన్న సఖీసఖులు వెనువెంటనే పద్ధతిగా ముద్దులకు సిద్ధపడితే తప్పేంటన్న బుద్ధి పుట్టకమానదు. వేటూరి ఒక్కోపాట ఒక్కో ప్రేమ పాఠం చెబుతుంది. సినిమాల్లో కురిసిన సిరివెన్నెల.. సీతారామశాస్త్రి. అశ్లీలానికి తావివ్వకుండానే ప్రేమికుల చేత ‘బలపం పట్టి భామ ఒళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకుంటా..’ అనిపించారు. ‘కృష్ణా నిన్ను చేరింది.. అష్టాక్షరిగా మారింది.. నివాళిగా నా మది నివేదించు సమయమిది..’ అని అచ్చమైన ప్రేమ విన్నపం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో వినిపించారు.
రొమాంటిక్ సాంగ్స్ అన్నీ ప్రేమ గీతాలు కాకపోవచ్చు. కానీ, ప్రేమ పాటలన్నీ శృంగార రస గుళికలే! ఆ పాటల్ని ఎవరు పాడినా అవి బ్యూటిఫుల్‌గానే ఉంటాయి. ‘హలో గురూ! ప్రేమ కోసమే రా జీవితం..’ పాటలో ఎస్పీబీ పలికించిన డైనమిక్స్.. ప్రేయసికి ప్రపోజ్ చేసే ప్రేమికుడికి కొత్త శక్తిని ఇవ్వకుండా ఉంటాయా! సిధ్ శ్రీరాం కీచు గొంతుకలోంచి పుట్టిన ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ పాటను ప్రేమలో పడ్డవారికి ఎన్నిసార్లు విన్నా ఏదో చాల్లేదనిపిస్తుంది. అదంతా ప్రేమ పాట గొప్పదనమే! ప్రేమ గీతోపదేశాన్ని ఆస్వాదించండి. ఇష్క్ తోటలో పుట్టిన మొహబ్బత్ పాటలను అనుసరించండి. ‘ప్రేమించే ప్రేమవా..’ అంటూ ‘ఊరించే ఊహ..’కు ఊసులు వ్యక్తపరచండి. ప్రేమికుల రోజున జంటగా పాటల పల్లకీలో ఊరేగండి.
ఈ పాటల పాచిక పారకపోతే, అందం అందకుండా పోయినా, బంధం బలపడకముందే వీగిపోయినా.. గాబరా పడాల్సిన పనిలేదు. ప్రేమ విఫలమైనా… ఆ విరహాన్ని అధిగమించే అద్భుతమైన పాటలు సినీతోటలో ఎన్నో ఉన్నాయ్! ‘ప్రేమలేదని… ప్రేమించరాదని.. సాక్ష్యమే నీవనీ…’ అని నిన్ను నువ్వు చాటుకోవచ్చు. సముద్రాల వారన్న ‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయి.. ఆ ఎరుకే నిశ్చలానందమోయ్..’ పాట గొణుక్కుంటూ బ్రహ్మానందం పొందొచ్చు. ఎందుకంటే… మన లవ్‌డాక్టర్ శంకర్‌దాదా సెలవిచ్చినట్టు… ఈ వాలెంటైన్స్ డే నాడు ‘మీ ఏరియాలోకి ఐశ్వర్య రావొచ్చు…..’, అమ్మా ప్రేమకుమారీ మీ వాడకట్టులోకి చింపిరి జుట్టున్న గ్రీకువీరుడు నీ రాకుమారుడై రావొచ్చు. అందాకా పాటలు ఆలకిస్తూ పండుగ చేసుకోవడమే!!
-కణ్వస