హైదరాబాద్, ఫిబ్రవరి 28: ఆ ఉద్యోగి పనిచేస్తే ఆహా ఓహో అన్నారు.. చాలా బాగా పనిచేస్తున్నావ్ అని కితాబిచ్చారు.. ‘స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ది మంత్’ అని ట్యాగ్ కూడా ఇచ్చారు.. కానీ, నెల తిరిగే సరికి నిజంగానే ‘స్టార్’ కనిపించేలా షాక్ ఇచ్చిందా కంపెనీ. అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు మెయిల్ చేసింది. ఒక్కసారిగా అతడికి గుండె ఆగినంత పనైంది. ఆర్థిక మాంద్యం భయంతో ఖర్చులు తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ప్రకటిస్తున్న లేఆఫ్‌లు ఉద్యోగుల జీవితాలను ఎలా తలకిందులు చేస్తున్నాయనే దానికి హైదరాబాద్‌లోని గూగుల్ కార్యాలయంలో పని చేస్తున్న ఈ ఉద్యోగి అనుభవం ఒక ఉదాహరణ. లేఆఫ్‌లతో ఉద్యోగాలు కోల్పోయిన అందరిదీ ఇదే పరిస్థితి. మిగతా వారు కూడా ఎప్పుడు లేఆఫ్ ఈమెయిల్ వస్తుందోనన్న ఆందోళనతో ఉన్నారు.