వెలుగు పత్రికకు బీఆర్ఎస్ నోటీస్.. మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసే దుష్టప్రయత్నం
‘బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే వెలుగు దినపత్రిక దుష్ప్రచారం చేస్తున్నది. ఇదే కోవలో అక్టోబర్ 17న మొదటిపేజీలో ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ పేరిట తప్పుడు కథనాన్ని ప్రచురించింది’ అని బీఆర్ఎస్ ఆరోపించింది.
- బీఆర్ఎస్ అధినేతపై బురదజల్లేలా ‘ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ పేరిట తప్పుడు కథనం
- 24 గంటల్లోగా దాన్ని ఉపసంహరించుకోవాలి
- తప్పును అంగీకరిస్తూ ఫస్ట్‌పేజీలో ప్రచురించాలి
- పత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్చార్జి సోమ భరత్ లీగల్ నోటీసులు
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : ‘బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే వెలుగు దినపత్రిక దుష్ప్రచారం చేస్తున్నది. ఇదే కోవలో అక్టోబర్ 17న మొదటిపేజీలో ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ పేరిట తప్పుడు కథనాన్ని ప్రచురించింది’ అని బీఆర్ఎస్ ఆరోపించింది. ‘తప్పుడు రాతలు రాసిన వెలుగు దినపత్రిక 24 గంటల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.. క్షమాపణను మొదటిపేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించడంతోపాటు, దినపత్రికకు చెందిన డిజిటల్ వేదికలు, అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనూ వెల్లడించాలి’ అని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్‌సెల్ ఇన్చార్జి సోమ భరత్‌కుమార్ వెలుగు యాజమాన్యం, ఎడిటర్‌కు ఆదివారం లీగల్ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం సహా సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రైతాంగం గతిని మార్చిన సాగునీటి ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించాలనే నెపంతో వెలుగు దినపత్రిక రాజకీయ దురుద్దేశంతో ప్రచురించిన అసత్య కథనాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదని పేర్కొన్నారు.
ఈ కథనానికి ఆధారాలేవి?
యాదాద్రి భువనగిరి జిల్లా సాగునీటి అవసరాలు, కొండపోచమ్మసాగర్, కాలువల మార్గాలను కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంతో ముడిపెడుతూ ప్రచురించిన ఈ కథనానికి అధికారిక ఆధారాలేమిటి? అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. సాగునీటి శాఖ రికార్డులను పరిశీలించారా? కాలువల వాస్తవ మార్గాలను ధ్రువీకరించారా? సంబంధిత శాఖ అధికారుల నుంచి వివరణ తీసుకున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు లేకుండా తప్పుడు, సంచలనాత్మక శీర్షికలతో ఆధారాల్లేకుండా ఆరోపణలు గుప్పించడం జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమని ఆక్షేపించింది. కేసీఆర్ పేరును ఉపయోగించుకొని వివాదాలు సృష్టించడం, బీఆర్ఎస్ నాయకత్వంపై బురదజల్లడం, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై అపోహలు సృష్టించడం, అప్రతిష్టపాల్జేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపింది. వార్తా పత్రికను రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చి, పత్రికా స్వేచ్ఛ ముసుగులో నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకొనేది లేదని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

పత్రికా స్వేచ్ఛను బీఆర్ఎస్ గౌరవిస్తుంది
పత్రికా స్వేచ్ఛను బీఆర్ఎస్ గౌరవిస్తుందని, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులను ప్రశ్నించే హకును సమర్థిస్తుందని ఆ పార్టీ స్పష్టంచేసింది. అయితే ఆ స్వేచ్ఛకు బాధ్యత కూడా ఉండాలని, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే ఆరోపణలకు తగిన ఆధారాలు ఉండాలని పేర్కొన్నది. తెలంగాణ సాగునీటి రంగంపై వాస్తవాల ఆధారంగా చర్చించాల్సింది పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం వార్తలను వక్రీకరించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తంచేసింది. నోటీసులు అందిన 24 గంటల్లోగా వెలుగు యాజమాన్యం, ఎడిటర్ వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలని, అందులో చేసిన ఆరోపణలకు ఆధారాలతో కూడిన వివరణ ఇవ్వాలని, కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సోమ భరత్‌కుమార్ డిమాండ్ చేశారు. గడువులోగా స్పందించకపోతే పరువు నష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత సంస్థ, వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రచారాన్ని, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టంచేశారు.
వెలుగు కథనం నిరాధారం : ఎన్నారైలు
హైదరాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): కేసీఆర్‌పై రాజకీయ కక్షతో వెలుగు పత్రికలో నిరాధార కథనాలు ప్రచురిస్తున్నారని ఎన్నారైలు విమర్శించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల కోసం అసత్య కథనాలు ప్రచురించారని ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నేత అనిల్ బైరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై తప్పుడు అభిప్రాయాలు కలిగించే దురుద్దేశంతోనే వండివార్చారని ఎస్డెన్మార్ అధ్యక్షుడు శ్యామ్‌బాబు మండిపడ్డారు.

కేసీఆర్‌పై రాసిన కథనాలపై ఆధారాలు చూపి తీరాలని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ నేత గుర్రాల నాగరాజు డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛకు ఆర్టికల్ 19(2) కింద పరిమితులు, బాధ్యతలు ఉంటాయని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖ నాయకుడు శ్రీధర్ చెప్పారు. కేసీఆర్ ప్రతిష్ఠను దిగజార్చడంతోపాటు గత ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అపోహలు సృష్టించే దురుద్దేశంతోనే ‘వెలుగు’ తప్పుడు కథనాలతో విషప్రచారం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ నేత హరీశ్ రంగ మండిపడ్డారు.
విషపురాతలు.. కట్టుకథలు : దేవీప్రసాద్
హైదరాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టులపై ‘వెలుగు’ పత్రిక విషప్రచారాన్ని చిమ్ముతున్నదని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. 15 టీఎంసీల భారీ సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును కేవలం కేసీఆర్ ఫామ్‌హౌస్ కోసమే నిర్మించారంటూ అసత్య కథనం ప్రచురించడం అక్రమమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసమే ఇలాంటి కథనాలు రాస్తున్నారని దుయ్యబట్టారు.

కొండపోచమ్మ సాగర్ నిర్మాణం వల్ల వందలాది గ్రామాల్లో భూగర్భ జలమట్టం పెరిగి, లక్షకు పైగా ఎకరాలకు ప్రత్యక్షంగా, లక్షలాది ఎకరాలకు పరోక్షంగా, సాగునీరు అందుతున్నదని వివరించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా రైతుల సాగునీటి అవసరాల కోసం నిర్మించిన కాలువల మార్గాలను కేసీఆర్ పొలాల కోసమేనని వక్రీకరించి తప్పుడు కథనాలు రాయడం వెనుక కుట్ర దాగి ఉన్నదని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచురించిన కథనాన్ని ‘వెలుగు’ యాజమాన్యం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పాలి : కోలేటి
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లను తరలిస్తున్నారని వెలుగు దినపత్రికలో వచ్చిన కథనం సత్యదూరమని బీఆర్ఎస్ కార్యదర్శి కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తప్పుడు కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిష్పక్షపాతంగా వార్తలు రాయాల్సిన మీడియా.. ఇలా అసత్య కథనాలతో కేసీఆర్‌పై బురదజల్లడం దుర్మార్గమని మండిపడ్డారు. తప్పుడు కథనాలపై వెంటనే కేసీఆర్‌కు పత్రికా యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

