నిఘా నీడలో నిమ్స్.. ఏకకాలంలో ఏసీబీ, డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి
అవినీతి కూపంలో చిక్కుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో అక్రమార్కులను ఏరిపారేసేందుకు నిఘా సంస్థలు దవాఖానను జల్లెడ పడుతున్నాయి.
- లక్ష్మీభాస్కర్ ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు ముమ్మరం
- పలు విభాగాల రికార్డులు పరిశీలించిన అధికారులు
- త్వరలో మరికొందరి అరెస్ట్‌లకు రంగం సిద్ధం
హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్ అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : అవినీతి కూపంలో చిక్కుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో అక్రమార్కులను ఏరిపారేసేందుకు నిఘా సంస్థలు దవాఖానను జల్లెడ పడుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇటీవల పోలీసు విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. వారితోపాటు డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం మధ్యాహ్నం నిమ్స్‌లో ఏకకాలంలో తనిఖీల చేపట్టారు. ముఖ్యంగా సెక్యూరిటీ, శానిటేషన్, క్యాంటీన్ టెండర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు, మెడికల్ షాపుల ఖరారుకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు అనుమానిత పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
వివిధ రకాల టెండర్లు, నియామకాలపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు జరిపినట్టు తెలిసింది. అర్ధరాత్రి వరకు అధికారులు దవాఖానలోని రికార్డులను పరిశీలించారు. గత 15 ఏండ్లుగా టెండర్లు లేకుండా ఒక్కరే చక్రం తిప్పిన తతంగం, ఆ తరహా జరిగిన ఇతర టెండర్లపై కూపీ లాగినట్టు సమాచారం. క్యాంటీన్, మెడికల్ షాపులు, సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్‌కేర్ తదితర టెండర్లలో పెద్దఎత్తున చేతులు మారడంపై ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ఈ వ్యవహారాలలో డాక్టర్ లక్ష్మీభాస్కర్తోపాటు మరో నలుగురు అధికారులు, ముగ్గురు నాన్ క్లినికల్ అధికారులు, గతంలో డీన్‌గా పనిచేసిన ఓ అధికారి ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్, న్యూరో సర్జరీ, ఇంటిగ్రేటెడ్ రేడియాలజీ, కార్డియాలజీ విభాగాల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలో అధికారులు ఆయా విభాగాలకు సంబంధించిన రికార్డులను సైతం తనిఖీ చేయనున్నట్టు సమాచారం.
క్యాంటీన్లో బయట పడిన డొల్లతనం
టీజీ-సేఫ్ అధికారులు నిమ్స్‌లో రోగులకు డైట్ సరఫరా చేసే ప్రధాన క్యాంటీన్ నక్షత్రాలో జరిపిన దాడుల్లో అనేక లొసుగులు బయటపడ్డాయి. గడువు తీరిన పదార్థాలు, నాసిరకం వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేయడం, అపరిశుభ్రమైన వాతావరణం తదితరాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ప్రమాదకరమైన రసాయనాలు, గడువు ముగిసిన బ్రెడ్ ప్యాకెట్లు, అల్లం పేస్టు, బెల్లం, పాపడాలు ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
మందుల్లో గోల్మాల్
డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడుల్లోనూ పలు అక్రమాలు వెలుగుచూసినట్టు సమాచారం. ముఖ్యంగా నిమ్స్‌లోని స్టోర్‌తోపాటు మెడికల్ షాపుల్లో నాణ్యతలేని ఔషధాలు, గడువు తీరిన మందులను అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఈ తనిఖీలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలున్నట్టు తెలిసింది. ఏసీబీ డీఎస్పీలు లక్ష్మీకాంత్‌రెడ్డి, చలపతి రాజేష్‌రెడ్డి నేతృతంలో సుమారు 25 మంది అధికారులు ఈ తనిఖీలు జరుపుతున్నారు. నిమ్స్ మెడికల్, సర్జికల్ విభాగాలలో డ్రగ్ ఇన్స్పెక్టర్ వివేక్ ఆనందరెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు.
అరెస్టుకు రంగం సిద్ధం
నిమ్స్‌లో అక్రమాలకు పాల్పడిన అధికారుల చిట్టా విప్పుతున్న ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. అవసరమైన పూర్తి ఆధారాలతో అక్రమార్కులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. త్వరలోనే కొందరు అధికారులను విచారించి, ఆ తరువాత వారిని అరెస్టు చేసే అవకాశాలున్నట్టు ఏసీబీ వర్గాల సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

