సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎస్బీహెచ్ కాలనీ.. ప్లాట్ నెంబర్ 17లో శేఖర్ (ఒకప్పుడు) నివసించేవాడు. అప్పుడు బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆయనకు గణపతి అంటే భక్తే కాదు ప్రాణం. ఎంతంటే తన జీవిత కాలాన్ని, ధనాన్ని ఆ గణేషుడికే అర్పించాడు. శేఖర్ వాళ్ల నాన్న మహారాష్ట్రలోని పండాపూర్ ప్రాంత వాసి. శేఖర్ షోలాపూర్‌లో పుట్టాడు. తండ్రి ఉద్యోగ బాధ్యతల వల్ల హైదరాబాద్ రావడంతో ఇక్కడ పెరిగాడు. శేఖర్‌కి అయిదేండ్లు ఉన్నప్పుడు అమ్మానాన్న షిరిడీ తీసుకుపోయారట. అక్కడ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన చిన్ని బొజ్జగణపయ్యని చూసి ముచ్చటపడి కొన్నాడు.
అలా మొదటి గణపతిని చేతుల్లోకి తీసుకున్నాడు. తన వయసుతోపాటు భక్తిభావమూ పెరిగింది. భక్తితో విఘ్నేశ్వరుడికి పూజలు చేయడంతోపాటు గణపతి ప్రతిమలు సేకరించడమూ మొదలుపెట్టాడు. విఘ్నేశ్వరుడి చిత్రాలు, విగ్రహాలు, ఫొటోలు, పాటల క్యాసెట్లు, సీడీలు, పుస్తకాలు, పత్రికల్లోని ప్రత్యేక కథనాలు, పోస్టర్లు సేకరించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేకరణ ఆపింది లేదు.
ప్రయాణంలో ఉన్నప్పుడు ఎవరికైనా దేవాలయం కనిపిస్తే ఆగి.. దేవుడిని దర్శించుకుని వెళ్తారు. శేఖర్ అలా కాదు. గణేశుడి ఆలయం కనిపిస్తే అక్కడే ఆగిపోతాడు. దానిని ఓ ఫొటో తీసుకుంటాడు. అక్కడి అంగళ్లలో అమ్మే గణపతి విగ్రహాలు, ఫొటోలు పరిశీలించి తన దగ్గర లేని రకం కనిపిస్తే కొనేస్తాడు. వినాయకుడి విగ్రహాలు, ఫొటోలు, పోస్టర్లు, పుస్తకాలు, క్యాసెట్లతో అతని ఇల్లు పెద్ద మ్యూజియంలా మారిపోయింది. ఇప్పుడు శేఖర్ ఇంట్లో ఎన్ని గణేశ్ ఆర్టికల్స్ ఉన్నాయో తెలుసా? 88,498 ఆర్టికల్స్ ఉన్నాయి! ఇందులో 21,508 విగ్రహాలున్నాయి. వేలి మొనపై నిలబెట్టేంత చిన్న పరిమాణం నుంచి నిలువెత్తున్న విగ్రహాలను ఇక్కడ చూడొచ్చు.
బాల గణపతి నుంచి సంకటహర గణపతి దాకా మొత్తం 32 రకాల గణపతి రూపాలను ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇంకా.. 15వేలకుపైగా గణేశుడి ఫొటోలు, రెండువేల పోస్ట్ కార్డులు, వెయ్యికిపైగా పోస్టర్లు, రెండు వందలకుపైగా పుస్తకాలు, రెండు వందల ఆడియో, వీడియో క్యాసెట్లు ఉన్నాయి. లార్జెస్ట్ గణేశ్ కలెక్టర్‌గా 2014లో గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కాడు. ఆ తర్వాత సంవత్సరం అదే రికార్డుని తిరగరాశాడు. శేఖర్ కలెక్షన్స్ 2010లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాయి. ఆ రికార్డు 2017 వరకు తిరగరాస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ పలు సంస్థలు ఆయన కలెక్షన్స్‌ని గుర్తిస్తూ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తూనే ఉన్నాయి.
మ్యూజియంలా మారిపోయిన ఈ ఇంట్లో బంగారం, వెండి, కంచు, ఇత్తడి, అల్యూమినియం, రాగి, రాళ్లు, టెర్రకోట, గాజు, శంఖు, గ్రానైట్, మట్టి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కాగితం, నారతో తయారు చేసిన వినాయకుడి బొమ్మలెన్నో ముచ్చటగా కొలువుదీరి ఉన్నాయి. ఈ బొమ్మల కొలువులోని కొన్నిటిని ఆయన స్వయంగా రూపొందించాడు. చిన్నప్పుటి నుంచి చిత్రకళలో ప్రవేశం ఉన్న శేఖర్ దానిని గణనాథుడికే అంకితం చేశాడు. కాగితం, గాజుపై ఆయన చిత్రాలను గీసి ఇంటి గోడలకు చక్కగా వేలాడదీశాడు. మట్టి, రాళ్లతో విగ్రహాలు రూపొందించాడు. మరికొందరు చిత్రకారులు గీసిన గణేశ్ చిత్రాలను కూడా సేకరించాడు.
దేశంలోని జైపూర్, కుంభకోణం, కోయంబత్తూరు, సిలుగుడి, కోల్‌కతా, జగన్నాథపురి, మహాబలిపురం, కొచ్చిన్, తిరువనంతపురం, పూణె, షోలాపూర్, కశ్మీర్ ప్రాంతాలకు చెందిన హస్త కళాకారులు రూపొందించిన గణేశ్ ప్రతిమలను సేకరించాడు. ఇవే కాకుండా చైనా, జపాన్, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, ఈజిప్ట్, కెన్యా, యూకే, పాకిస్థాన్, టర్కీ లాంటి మొత్తం నలభై దేశాల నుంచి గణేశ్ కళాఖండాలను సేకరించాడు. ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా, ఈజిప్ట్, చైనా, జావా, జకర్తా, బాలీ, సుమత్రా, మలేషియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ ఇలా 35 దేశాల్లోని గణేశుడి ఆలయాల ఫొటోలను భద్రపరిచాడు శేఖర్.
గణనాథుని కొందరు బాల గణపతిగా కొలుస్తారు. మరికొందరు మూషిక వాహనుడిని ప్రతిష్ఠించుకుని పూజిస్తారు. విదేశాల్లో స్థానిక శైలిలో గణనాథుని రూపొందించుకుని ఆరాధిస్తారు. ప్రపంచమంతా పూజలందుకునే గణనాథులను చూడాలంటే ఈ మ్యూజియంలో అడుగుపెట్టాలి. ఇక్కడ బొజ్జగణపయ్య ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, నడుస్తూ, మువ్వ గోపాలుడిగా, మోహన రూపుడిగా ఎన్నెన్ని రూపాల్లోనో దర్శనమిస్తాడు. ప్రపంచంలోని గణేశుడి రూపాలన్నీ ఈ ఇంట్లో కొలువుదీరి ఉన్నాయి. ఇళ్లల్లో భగవంతుడి కోసం చిన్న పూజ గది ఉంటే పబ్సెట్టి శేఖర్ ఇల్లంతా భగవంతుడే ఆక్రమించాడు. చివరికి తానే మరో ఇంటికి మారిపోయాడు! ఎక్కడా లేనన్ని గణనాథుని ప్రతిమలతో ఆ ఇల్లు రికార్డులకెక్కింది!
-నాగవర్ధన్ రాయల