వర్షాకాలం మొదలైంది. బయటికెళ్లినప్పుడు వానలో తడిసే అవకాశం ఉంటుంది. జుట్టును త్వరగా ఆరబెట్టుకోకుంటే.. జలుబుతోపాటు జ్వరం కూడా పలకరిస్తుంది. అందుకే, ఓ మంచి హెయిర్ డ్రయర్ ఎప్పుడూ వెంటే ఉంచుకోవడం మంచిది. Dyson Supersonic Travel Edition.. అలాంటిదే! ప్రయాణాల్లోనూ మీ జుట్టును సులభంగా ఆరబెట్టేస్తుంది. సాధారణ సూపర్ సోనిక్ డ్రయర్‌తో పోలిస్తే.. ఇది చాలా చిన్నగా, తక్కువ బరువుతో ఉంటుంది. ట్రావెల్ బ్యాగులు, లగేజీలో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులోని ఇంటెలిజెంట్ హీట్ కంట్రోల్.. సెకనుకు 40 సార్లకు పైగా గాలి ఉష్ణోగ్రతను కొలుస్తుంది. ఎక్కువ వేడి వల్ల జుట్టు పాడవకుండా కాపాడుతుంది. జుట్టు సహజమైన మెరుపును కోల్పోకుండా చూస్తుంది. ఇందులో శక్తిమంతమైన వీ9 మోటార్‌తోపాటు ఎయిర్ మల్టిప్లయర్ టెక్నాలజీ వల్ల.. గాలిని ముప్పై రెట్లు వేగంగా బ్లో చేస్తుంది. దాంతో తక్కువ సమయంలోనే జుట్టు వేగంగా ఆరిపోతుంది. దీంతోపాటే విభిన్న జుట్టు రకాల (కర్లీ, స్ట్రెయిట్, థిక్ హెయిర్) కోసం మాగ్నెటిక్ స్టయిలింగ్ అటాచ్మెంట్స్ కూడా లభిస్తాయి.
పని వేగాన్ని పెంచే మౌస్

సాఫ్ట్వేర్ డెవలపర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్లు, ఆఫీస్ ప్రొఫెషనల్స్ కోసం.. లాజిటెక్ సంస్థ సరికొత్త మౌస్‌ను తీసుకొచ్చింది. ఆధునాతన అప్‌గ్రేడ్స్‌తో, పని వేగాన్ని పెంచేలా MX Master4కు రూపకల్పన చేసింది. ఇందులోని పవర్ఫుల్ సెన్సర్.. క్లియర్ గ్లాస్ టేబుల్స్ మీద కూడా చాలా ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ఇందులోని ప్రధాన ఆకర్షణ.. మెటల్ స్క్రోల్ వీల్. ఇది ఒక సెకనులో 1,000 లైన్ల వరకు చాలా నిశ్శబ్దంగా స్క్రోల్ చేయగలదు. నెమ్మదిగా తిప్పితే లైన్-బై-లైన్, వేగంగా తిప్పితే ఫ్రీ-స్పిన్ మోడ్‌లోకి ఆటోమేటిక్‌గా మారిపోతుంది. దీని ప్రత్యేక డిజైన్ వల్ల.. గంటల తరబడి వాడినా చేయి నొప్పి పెట్టకుండా ఉంటుంది. ఎక్స్ట్రా స్క్రోల్ వీల్ ద్వారా ఎక్సెల్ షీట్లను పక్కలకు కూడా స్క్రోల్ చేయవచ్చు. వీడియో ఎడిటింగ్ టైమ్‌లైన్‌ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా మౌస్ బటన్లకు నచ్చిన షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకోవచ్చు. మల్టీ-డివైజ్ కనెక్టివిటీతో ఒకేసారి మూడు వేర్వేరు డివైజ్‌లకు (విండోస్, మ్యాక్, లైనెక్స్) కనెక్ట్ అవుతుంది. ఇక లాజిటెక్ ఫ్లో ఫీచర్ ద్వారా.. ఒకే మౌస్తో రెండు వేర్వేరు కంప్యూటర్ల స్క్రీన్ల మధ్య కూడా కర్సర్‌ను తిప్పవచ్చు. ల్యాపీ, పీసీ ముందు ఎక్కువ సమయం గడిపే ప్రొఫెషనల్స్‌కు ఇది బెస్ట్ ప్రీమియం డివైజ్ అని చెప్పొచ్చు.
చెవిలో ఆరోగ్య రహస్యం!

స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ రింగ్‌ల తర్వాత.. వేరబుల్ టెక్నాలజీ విభాగంలో మరో వినూత్న ఆవిష్కరణ. ఆరోగ్యంపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచడానికి ఇప్పుడు స్మార్ట్ హెయిర్ రింగ్స్ వచ్చేశాయి. Lumia 2.. ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన హెల్త్ ట్రాకింగ్ పరికరంగా గుర్తింపు పొందింది. సాధారణ స్మార్ట్ వాచ్‌లు, రింగ్‌లు కేవలం హృదయ స్పందన రేటును మాత్రమే కొలుస్తాయి. కానీ, లూమియా-2 మెదడుకు జరిగే రక్త ప్రసరణను నిరంతరం పర్యవేక్షిస్తుంది. దీనివల్ల మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గడం, తల తిరగడం, బ్రెయిన్ ఫాగ్ లాంటివి ఎందుకు జరుగుతున్నాయో కచ్చితంగా అంచనా వేస్తుంది. ఇక చేతితో పోలిస్తే.. చెవి భాగం గుండెకు, మెదడుకు దగ్గరగా ఉంటుంది. అలాగే చెవులు తక్కువగా కదులుతాయి. అందువల్ల ఇందులో ఉండే సెన్సర్లు.. నిద్ర, శరీర ఉష్ణోగ్రత, గుండె వేగం, మహిళల పీరియడ్స్ సైకిల్‌ను అత్యంత కచ్చితత్వంతో ట్రాక్ చేస్తాయి. చెవులు కుట్టించుకోని వారి కోసం ఇయర్ కఫ్స్ రూపంలోనూ ఇవి లభిస్తున్నాయి. గోల్డ్, సిల్వర్, టైటానియం ఫినిషింగ్స్లోనూ అందుబాటులో ఉన్నాయి.
డెస్క్‌కు కొత్త కళ

అన్నిటా కొత్తదనాన్ని కోరుకుంటారా? వర్క్‌స్పేస్‌కు మోడ్రన్ లుక్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే, ఏసర్ సంస్థ నుంచి వచ్చిన Acer Ergo Multifunction Monitor and Laptop Stand మీకు పర్ఫెక్ట్ చాయిస్! మానిటర్లు, ల్యాప్‌టాప్ కోసం రూపొందించిన ఎర్గోనామిక్ డెస్క్‌టాప్ రైజర్ ఇది. ఇందులో ఇంటిగ్రేటెడ్ స్టోరేజ్, డేటా కనెక్టివిటీతోపాటు 15 కేజీల వరకు బరువును మోయగల డెస్క్ స్పేస్ ఉంటుంది. ఈ స్టాండ్‌లోనే నాలుగు ఇంటిగ్రేటెడ్ యూఎస్బీ పోర్ట్స్ ఉంటాయి. ఇవి డేటా ట్రాన్స్మిషన్, డివైజ్ చార్జింగ్ రెండిటికీ ఉపయోగపడతాయి. ఫోన్, టాబ్లెట్ పెట్టుకోవడానికి ప్రత్యేక హోల్డర్ ఉంది. అలాగే కింద భాగంలో 19 ఇంచుల వరకు ఉండే కీబోర్డును దాచుకోవడానికీ స్పేస్ ఉంటుంది. స్క్రీన్లను దాదాపు 7 సెం.మీ ఎత్తుకు పెంచుతుంది. దీనివల్ల కళ్లకు సరైన లెవెల్లో స్క్రీన్ కనిపిస్తూ, మెడ నొప్పి రాకుండా సహాయపడుతుంది.