IPL | ఓవరాల్‌గా ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తొలి బౌలర్‌గా ముంబై ఇండియన్స్ పేసర్ ఆకాశ్ మధ్వాల్(5/5) నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆకాశ్ ఐదు పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమిష్టిగా సత్తాచాటిన ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఏకపక్షంగా సాగిన ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై రోహిత్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. బ్యాటర్లంతా తలా కొన్ని పరుగులు చేయడంతో మంచి స్కోరు చేసిన ముంబై.. ఆనక కట్టుదిట్టమైన బౌలింగ్, పటిష్ట ఫీల్డింగ్‌తో లక్నో ఆట కట్టించింది. యువ పేసర్ ఆకాశ్ మధ్వాల్ 5 వికెట్లతో లక్నో బ్యాటింగ్ వెన్ను విరిచాడు. తాజా సీజన్లో ధోనీ సేన ఇప్పటికే ఫైనల్ చేరుకోగా.. తుదిపోరుకు చేరేందుకు శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.
చెన్నై: పేసర్ల జోరు సాగిన పోరులో ముంబై ఇండియన్స్ విజృంభించింది. లీగ్ దశలో పడుతూ లేస్తూ.. ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ప్లే ఆఫ్స్‌కు చేరిన రోహిత్ సేన.. ఎలిమినేటర్‌లో విశ్వరూపం కనబర్చింది. మొదట బ్యాటింగ్‌లో తలాకొన్ని పరుగులు చేసి మంచి స్కోరు చేసిన ముంబై.. ఆనక బౌలింగ్‌లో ఆకాశ్ చెలరేగిపోవడంతో సునాయాసంగా నెగ్గి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో రోహిత్ సేన 81 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. శుక్రవారం జరుగనున్న క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
కామెరూన్ గ్రీన్ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ (26; 2 సిక్సర్లు), నేహల్ వధేరా (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 4, యష్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. స్టోయినిస్ (40; 5 ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం చేయగా.. తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. ప్రేరక్ (3), కృనాల్ పాండ్యా (8), కైల్ మయేర్స్ (18), ఆయుష్ బదోనీ (1), నికోలస్ పూరన్ (0), దీపక్ హుడా (15), కృష్ణప్ప గౌతమ్ (2) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 3.3 ఓవర్లలో 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా.. ముగ్గురు లక్నో బ్యాటర్లు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. ఆకాశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కష్టతరం కాని లక్ష్యఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ప్రేరక్, మయేర్స్ ఎక్కువ సేపు నిలువలేకపోవడంతో ఆ జట్టు 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టోయినిస్ ధాటిగా ఆడటంతో లక్నో కోలుకుంది. మరో ఎండ్‌లో కెప్టెన్ కృనాల్ నెమ్మదిగా ఆడుతుండటంతో పాటు.. బదోనీ, పూరన్, హుడా బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో లక్నో సులువుగా ఓటమి అంగీకరించదు అనిపించింది. కానీ నిప్పులు చెరిగే బంతులతో విశ్వరూపం కనబర్చిన ముంబై పేసర్ ఆకాశ్ మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. బుల్లెట్ల వంటి బంతులతో ప్రతి బాల్‌కు వికెట్ పడగొట్టేలా కనిపించిన ఆకాశ్.. ఐపీఎల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. అతడి ధాటికి ప్రేరక్, బదోనీ, పూరన్, రవి బిష్ణోయ్ (3), మొహసిన్ ఖాన్ (1) డగౌట్ బాట పట్టారు. ఒకవైపు ఆకాశ్ వీర విహారం చేస్తుంటే.. మరోవైపు లక్నో స్వయంకృత అపరాధాలతో కొంత దెబ్బతింది. మంచి లయలో బ్యాటింగ్ చేస్తున్న స్టోయినిస్.. పరుగు తీస్తున్న సమయంలో సహచరుడు దీపక్ హుడా అడ్డురావడంతో రనౌట్ కాగా.. ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్, హుడా కూడా రనౌట్‌గానే వెనుదిరిగారు. దీంతో ఒక దశలో 69/2తో ఉన్న సూపర్ జెయింట్స్ మరో 32 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది.
ముంబై: 182/8 (గ్రీన్ 41, సూర్యకుమార్ 33; నవీన్ 4/38, యష్ 3/34),
లక్నో: 16.3 ఓవర్లలో 101 ఆలౌట్ (స్టోయినిస్ 40; మయేర్స్ 18; ఆకాశ్ 5/5).