ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ గులాబీ మొక్కకు అంటు కట్టినట్లు ఒక పద్ధతి ప్రకారం చెలరేగడంతో మంచి ఆరంభం లభించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు.. టెయిలెండర్లు మెరుపు ముగింపునిచ్చారు. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్న రీతిలో శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ విరుచుకుపడటంతో పంత్ సేన భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో కోల్‌కతా కూడా మెరుగ్గానే కనిపించినా.. గతంలో ఆ ఫ్రాంచైజీకి ఆడుతూ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్ బంతితో విజృంభించడంతో ఢిల్లీ అలవోకగా గెలుపొందింది.
ముంబై: బ్యాటర్ల బాదుడుకు బౌలర్ల సహకారం తోడవడంతో ఐపీఎల్ 15వ సీజన్లో ఢిల్లీ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన తొలి పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా (29 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (45 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో అలరించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించగా.. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ (11 బంతుల్లో 29; ఒక ఫోర్, 3 సిక్సర్లు), కెప్టెన్ రిషబ్ పంత్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (22; 2 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 19.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) నితీశ్ రాణా (30; 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ 4, ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టారు. అర్ధశతకంతో జోరుమీదున్న శ్రేయస్ అయ్యర్‌ను బుట్టలో వేసుకున్న కుల్దీప్.. 16వ ఓవర్లో పాట్ కమిన్స్ (4), సునీల్ నరైన్ (4), ఉమేశ్ యాదవ్ (0)ను పెవిలియన్ బాట పట్టించాడు. అందులో ఉమేశ్ యాదవ్‌ను రిటర్న్ క్యాచ్ ద్వారా ఔట్ చేసిన విధానం చూసి తీరాల్సిందే.
శభాష్ కుల్దీప్..
కోల్‌కతాతో పోరులో కుల్దీప్ యాదవ్ చిరుతను తలపించాడు. 16వ ఓవర్లో ఈ చైనామన్ స్పిన్నర్ అద్భుతాన్ని అవిష్కరించాడు. అప్పటికే మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్న ఈ మణికట్టు మాంత్రికుడు తన కోటా చివరి బంతిని ఉమేశ్‌కు సంధించాడు. స్వీప్ ఆడే క్రమంలో ఉమేశ్ బ్యాట్ అంచును తాకిన బంతి గాల్లోకి లేవగా.. మెరుపు వేగంతో స్పందించిన కుల్దీప్ అమాంతం గాల్లోకి ఎగురుతూ క్యాచ్ అందుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 215/5 (వార్నర్ 61, పృథ్వీ షా 51; నరైన్ 2/21), కోల్‌కతా: 19.4 ఓవర్లలో 171 ఆలౌట్ (శ్రేయస్ 54, నితీశ్ 30; కుల్దీప్ 4/35).