స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చిన ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్.. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్ చేరే క్రమంలో రెండు సెట్లు మాత్రమే కోల్పోయిన ఈ పోలాండ్ భామ.. తుదిపోరులో ట్యూనీషియా యువ సంచలనం ఆన్స్ జాబర్‌ను చిత్తు చేసింది. బలమైన బ్యాక్ హ్యాండ్ షాట్లతో విజృంభించిన స్వియాటెక్.. యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన తొలి పోలాండ్ క్రీడాకారిణిగా రికార్డుల్లోకెక్కింది. కెర్బర్ ( 2016లో) తర్వాత ఒకే ఏడాది రెండు గ్రాండస్లామ్స్ నెగ్గిన ప్లేయర్‌గా నిలిచిన స్వియాటెక్.. తన గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్యను మూడుకు పెంచుకుంది.
న్యూయార్క్: ప్రపంచ నంబర్ వన్, పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ యూఎస్ ఓపెన్ మహిళల టైటిల్ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వియాటెక్ 6-2, 7-6 (7/5)తో ట్యూనీషియాకు చెందిన ఆన్స్ జాబర్‌ను ఓడించి కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకుంది. గతంలో రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు.. యూఎస్ ఓపెన్‌లో ఇది తొలి టైటిల్. కాగా ఈ టైటిల్ సాధించిన తొలి పోలాండ్ క్రీడాకారిణిగా స్వియాటెక్ రికార్డులకెక్కింది. అంతేగాక 2016లో ఏంజెలిక్ కెర్బర్ తరువాత ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన క్రీడాకారిణిగా స్వియాటెక్ ఘనత అందుకుంది. ఈ విజయంతో స్వియాటెక్ తాజా ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోనుండగా, జాబర్ రెండో ర్యాంక్‌కు చేరుకోనుంది. ఈ ఏడాది వింబుల్డన్ ఫైనల్‌కు చేరినపుడు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు చేరిన తొలి అరబ్ మహిళగా రికార్డుల్లోకెక్కిన జాబర్, ఇపుడు యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికా క్రీడాకారిణిగా చరిత్ర తిరగరాసింది.
బ్యాక్‌హ్యాండ్ షాట్లతో..
మ్యాచ్ ఆరంభంనుంచి స్వియాటెక్ ఆధిపత్యం ప్రదర్శించింది. పదునైన సర్వీసులు, తిరుగులేని గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో స్వియాటెక్ తొలి సెట్ ఆరంభంలోనే 3-0 ఆధిక్యం సాధించింది. అయితే జాబర్ పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లతో అంతరాన్ని 3-2కు తగ్గించింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. స్వియాటెక్ వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి తొలి సెట్ కైవసం చేసుకుంది. జాబర్ బ్యాక్‌హ్యాండ్ షాట్ నెట్ తగలడంతో సెట్ స్వియాటెక్ పరమైంది. రెండో సెట్లోనూ స్వియాటెక్ జోరును సాగించి ఒక బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో 3-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. దీనితో టాప్ ర్యాంకర్ అలవోకగా విజయం సాధిస్తుందని భావించారు. అయితే ప్రేక్షకుల మద్దతుతో చెలరేగిన జాబర్ సెట్స్కోరు సమం చేయడమే కాకుండా టైబ్రేక్‌కు తీసుకెళ్లింది. అయితే జాబర్ అనవసర తప్పిదాలతో ప్రత్యర్థికి అవకాశమిచ్చి చేతులారా ఓటమి కొనితెచ్చుకుంది. ఎట్టకేలకు జాబర్ ఫోర్‌హ్యాండ్ షాట్ కోర్టు బయటకు వెళ్లడంతో స్వియాటెక్‌కు విజయం దక్కింది.
ఆస్ట్రేలియా జోడికి మిక్స్డ్ టైటిల్
ఆస్ట్రేలియాకు చెందిన జాన్ పీర్స్, స్టార్మ్ శాండర్స్ యుఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫైనల్లో పీర్స్-శాండర్స్ జోడీ 4-6, 6-4, 10-7తో కిర్‌స్టన్ ఫ్లిప్కెన్స్(బెల్జియం)-ఎడార్డొ రోజర్ వాసిలిన్ (ఫ్రాన్స్) ద్వయంపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్‌లో వీరికిదే తొలి మేజర్ టైటిల్. పీర్స్ 2017 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గాడు.
స్వియాటెక్‌కు కేక్ గిఫ్ట్
టైటిల్ గెలిచిన స్వియాటెక్‌కు యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ట్రోఫీతోపాటు ఆశ్చర్యకరమైన బహుమతిని అందజేశారు. స్వియాటెక్‌కు ఇటలీ వంటకం తిరమిసు కేక్ అంటే చాలా ఇష్టం కావడంతో ట్రోఫీ లోపల తిరమిసు కేక్‌ను పెట్టి అందజేశారు. బహుమతి ప్రదానం అనంతరం విలేకరుల సమావేశంలో స్వియాటెక్ ఈ విషయం వెల్లడిస్తూ ఆ కేక్‌ను అక్కడే ఆరగించింది.
టోర్నీ ఆరంభానికి ముందు ఈ ఫలితం ఊహించలేదు. ఈ రెండు వారాలు చాలా గొప్పగా సాగాయి. విజేతగా నిలువడం చాలా ఆనందంగా ఉంది. మానసికంగా బలంగా ఉండటం వల్లే గెలుపు సాధ్యమైంది.
-స్వియాటెక్, యూఎస్ ఓపెన్ విజేత
1 యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి పాలాండ్ ప్లేయర్‌గా స్వియాటెక్ రికార్డుల్లోకెక్కింది.
ప్రైజ్ మనీ
విజేత: స్వియాటెక్ 20.71 కోట్లు
రన్నరప్: జాబర్ 10.35 కోట్లు
స్వియాటెక్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ -3
ఫ్రెంచ్ ఓపెన్ -2 (2020, 2022)
యూఎస్ ఓపెన్ -1 (2022)