Rohan Bopanna: టెన్నిస్‌లో ఒక గ్రాండ్ స్లామ్ గెలవడాన్ని ఆటగాళ్లు గౌరవంగా భావిస్తారు. ఒక ఏడాదిలో జరిగే నాలుగు గ్రాండ్ స్లామ్స్ (ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబూల్డన్, యూఎస్ ఓపెన్)లో ఒక్కదాన్లో అయినా మెరవాలని ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది టెన్నిస్ ఆటగాళ్లు చెమటోడ్చుతారు. టాప్ సీడ్ ఆటగాళ్లతో పాటు అన్‌సీడెడ్ ప్లేయర్లూ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం హోరాహోరి పోరాడుతారు. తీవ్ర పోటీ ఉండే ఈ ఆటలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైనల్లో ట్రోఫీ సొంతం చేసుకోవడం సాధారణ విషయం కాదు. తాజాగా భారత వెటరన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న.. 43 ఏండ్ల వయసులో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తన సుదీర్ఘ కెరీర్లో పురుషుల డబుల్స్ విభాగంలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్నాడు. మొత్తంగా అతడికి ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఆస్ట్రేలియా ఓపెన్ – 2024 మెన్స్ డబుల్స్ ఫైనల్లో బోపన్న – మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ.. 7-6 (7-0), 7-5 తేడాతో సిమోన్ బొలెలి – ఆండ్రియా వవస్సోరి (ఇటలీ)పై గెలిచి టైటిల్ నెగ్గింది.
బోపన్న గ్రాండ్‌స్లామ్ నెగ్గడం అతడి కెరీర్లో ఇది రెండోసారి కాగా 43 ఏండ్ల వయసులో ట్రోఫీ నెగ్గడం ద్వారా అతడు అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డులెక్కాడు. ఈ విజయం ద్వారా బోపన్న.. 2017 తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. బోపన్న విజయం నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఇంతవరకూ టెన్నిస్‌లో ఎన్ని గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ గెలిచారు..? ఏ విభాగాల్లో వాళ్లు విజేతలుగా నిలిచారు..? వంటి వివరాలు ఇక్కడ చూద్దాం.
తొలి గ్రాండ్‌స్లామ్ విజేత భూపతి..
భారత్ నుంచి తొలి గ్రాండ్‌స్లామ్ నెగ్గింది టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి. 1997లో ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతూ అతడు మిక్స్డ్ డబుల్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఆ ఏడాది జపాన్ క్రీడాకారిణి రికా హిరాకితో కలిసి భూపతి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాడు. భూపతి తొలి గ్రాండ్‌స్లామ్ నెగ్గినా భారత్‌కు అత్యధిక గ్రాండ్‌స్లామ్ విజయాలు అందించింది మాత్రం లియాండర్ పేస్. భారత్ తరఫున ఆటగాళ్లు మొత్తం 32 గ్రాండ్ స్లామ్స్ నెగ్గితే అందులో పేస్ సాధించినవే 18 కావడం విశేషం. మొత్తంగా ఇండియా నుంచి గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గినవాళ్లలో మహేశ్ భూపతి, లియాండర్ పేస్, సానియా మీర్జాల తర్వాత తాజాగా బోపన్న ఆ జాబితాలో చేరాడు.
Age is just a number 🙌
Congrats, @rohanbopanna! pic.twitter.com/KGLoXyRQOc
— #AusOpen (@AustralianOpen) January 25, 2024
పేస్ రికార్డుల పరంపర..
కెరీర్ ఆరంభంలో సింగిల్స్ ఆడినా 1998 తర్వాత పేస్ పూర్తిగా డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌కే పరిమితమయ్యాడు. ఈ రెండు విభాగాలలో పేస్ రికార్డు స్థాయిలో గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు. 1996లో అట్లంటా వేదికగా జరిగిన ఒలింపిక్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన పేస్.. 8 మెన్స్ డబుల్స్ టైటిల్స్ నెగ్గాడు. ఏకంగా పది మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ గెలిచాడు. మహేశ్ భూపతితో కలిసి మెన్స్ డబుల్స్‌లో మూడు టైటిల్స్ గెలిచాడు. మార్టినా నవ్రతిలోవా, మార్టినా హింగిస్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లను కొల్లగొట్టాడు. మెన్స్ డబుల్స్లోలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలను గెలిచిన అతడు.. మిక్స్డ్ డబుల్స్‌లో ఆస్ట్రేలియా ఓపెన్ మూడుసార్లు, వింబూల్డన్ నాలుగు సార్లు, యూఎస్ ఓపెన్ రెండుసార్లు, ఫ్రెంచ్ ఓపెన్ ఒకసారి నెగ్గాడు.
భూపతి ఖాతాలో డజను టైటిల్స్..
1997లో తొలి గ్రాండ్‌స్లామ్ నెగ్గిన భూపతి.. ఆ తర్వాత లియాండర్ పేస్ తో కలిసి 1999లో ఫ్రెంచ్ ఓపెన్, అదే ఏడాది వింబూల్డన్, 2001లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో 8 టైటిల్స్ గెలిచిన భూపతి.. 2009లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్ లను సానియా మీర్జాతో కలిసి గెలిచాడు.
సానియా యుగం..
భారత మహిళల టెన్నిస్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న సానియా మీర్జా.. 2015లో వరల్డ్ నెంబర్ వన్ అయింది. 2009లో తొలిసారి మహేశ్ భూపతితో కలిసి తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్ (మిక్స్డ్ డబుల్స్) నెగ్గిన ఆమె.. 2012, 2014లో యూఎస్ ఓపెన్ (బ్రూనో సోర్స్ – బ్రెజిల్) లోనూ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2015లో మార్టినా హింగిస్‌తో కలిసి వింబూల్డన్, యూఎస్ ఓపెన్ ఉమెన్స్ డబుల్స్ గెలిచింది. 2016లో హింగిస్‌తోనే కలిసి ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజేతగా నిలిచింది.
2024 Australian Open ✅
2017 French Open ✅Rohan Bopanna wins his second Grand Slam title!🇮🇳💙#AusOpen #Tennis #SKIndianSports pic.twitter.com/3bFbtFRvhQ
— Sportskeeda (@Sportskeeda) January 27, 2024
సానియా 2016లో గ్రాండ్‌స్లామ్ నెగ్గాక 2017లో బోపన్న.. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కెనడాకు చెందిన గాబ్రియాలా డాబ్రోస్కితో కలిసి విజేతగా నిలిచాడు. ఆ తర్వాత పురుషుల డబుల్స్‌లో ఎబ్డెన్తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాడు.