Nebuliser Mask | ఎలక్ట్రిక్ నెబ్యులైజర్ మాస్క్.. ఓ నిరుద్యోగి సృజనాత్మకత
Nebuliser Mask | యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్ముఖి గ్రామానికి చెందిన కుంచాల శివనాగరాజు (22). కరోనా కష్టకాలంలో అతను రూపొందించిన ‘ఎలక్ట్రిక్ నెబ్యులైజర్ మాస్క్' అందరినీ ఔరా అనిపిస్తున్నది. వర్షంలోనూ ధరించేందుకు వీలుండటం దీని ప్రత్యేకత. మనతోపాటు ఎక్కడికైనా

- సెల్‌ఫోన్ మాదిరిగా ఎక్కడికైనా తీసుకెళ్లేలా రూపకల్పన
- ‘ఇంటింటా-ఇన్నోవేటర్’లో అత్యుత్తమ ఆవిష్కరణగా గుర్తింపు
- గతంలోనూ ఎన్నో ఆవిష్కరణలు చేసిన శివనాగరాజు
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అతను ఓ తాపీ మేస్త్రీ కొడుకు. డిగ్రీ వరకు చదివి నిరుద్యోగిగా ఉన్నాడు. కానీ ప్రతిభావంతులైన ఇంజినీర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఓ సృజనాత్మక ఆవిష్కరణతో అందరి మన్ననలు అందుకొంటున్నాడు. అతనే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్ముఖి గ్రామానికి చెందిన కుంచాల శివనాగరాజు (22). కరోనా కష్టకాలంలో అతను రూపొందించిన ‘ఎలక్ట్రిక్ నెబ్యులైజర్ మాస్క్’ ( Nebuliser Mask ) అందరినీ ఔరా అనిపిస్తున్నది. వర్షంలోనూ ధరించేందుకు వీలుండటం దీని ప్రత్యేకత. మనతోపాటు ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేలా ఎంతో సౌకర్యవంతంగా రూపొందించిన ఈ మాస్క్‌ను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘ఇంటింటా-ఇన్నోవేటర్’ కార్యక్రమంలోనూ ఈ మాస్క్ అత్యుత్తమ ఆవిష్కరణగా నిలిచింది. ప్రస్తుతం ఒక్కో ఎలక్ట్రిక్ నెబ్యులైజర్ మాస్క్ తయారీకి రూ.670 ఖర్చవుతున్నదని, రానున్న రోజుల్లో దీన్ని రూ.500కే అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు చేస్తున్నానని శివనాగరాజు తెలిపారు.
ఎన్నో ఆవిష్కరణలు
సృజనాత్మక ఆవిష్కరణలతో అందరినీ ఆకట్టుకోవడం శివనాగరాజుకు కొత్తేమి కాదు. ‘దిశ’ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడినప్పుడు అతను ఆవిష్కరించిన ‘స్టన్ గన్’ ఎన్నో మన్ననలు పొందింది. ఆపత్కాలంలో మహిళలు, యువతులకు ఆయుధంలా ఉపయోగపడేలా రూపొందించిన ఈ స్టన్ గన్‌కు ‘దండన’ అనే పేరు పెట్టారు. ఇది షాక్‌ను కలుగజేసే తుపాకీ లాంటి ఆయుధం. దీన్ని ఉపయోగించినపుడు ఎదుటి వ్యక్తికి ఎలాంటి ప్రమాదం కలుగదు. కానీ కొంతసేపటి వరకు నిశ్చేష్టులను చేస్తుంది. ‘దండన’తోపాటు మహిళా పోలీసులకు ఉపయోగపడేలా శివనాగరాజు రూపొందించిన ఎలక్ట్రిక్ లాఠీ, ఎలక్ట్రిక్ బైక్, మినీ ట్రాక్టర్ లాంటి ఆవిష్కరణలు అతని సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రత్యేకతలు ఇవీ..
- ఐవీపైపు, ఫిల్టర్లతో కూడిన ఈ మాస్కు దుమ్ము ధూళి కణాలను సమర్థంగా నిరోధిస్తుంది. శ్వాస తీసుకునేందుకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
- సాధారణ వస్త్రంతో తయారుచేసిన ఈ మాస్క్ 10 సెంటీమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్ల వెడల్పుతో ఉంటుంది.
- నెబ్యులైజర్‌తో కలిపి 400 గ్రాముల బరువు ఉండే ఈ పరికరాన్ని సెల్‌ఫోన్ మాదిరిగా ఎక్కడికైనా వెంట తీసుకెళ్లవచ్చు.
- ఒక డీసీ మోటర్, రీచార్జ్ చేసుకునేందుకు సర్క్యూట్లు, గాలి ఫిల్టర్లను కలిగి ఉన్న నెబ్యులైజర్‌ను సెల్‌ఫోన్ ఛార్జర్‌తో గంటపాటు రీఛార్జ్ చేస్తే 4 గంటల పాటు వాడుకోవచ్చు.
స్టార్టప్‌తో యువతకు ఉపాధి కల్పిస్తా
ప్రోత్సాహం, ఆర్థిక సహకారం అందిస్తే ఎన్నో ఆవిష్కరణలకు పదునుపెడతా. ఎలక్ట్రిక్ నెబ్యులైజర్ మాస్కుల ఉత్పత్తి కోసం పేటెంట్తోపాటు ట్రేడ్‌మార్క్ లైసెన్స్‌ను పొందా. స్టార్టప్ ఏర్పాటు కోసం టీహబ్, మీడియం అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్‌కు దరఖాస్తు చేశా. రూ.10 లక్షల వరకు ఆర్థిక తోడ్పాటు లభిస్తే నాలాంటి ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నా. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే పేషెంట్లకు, అస్తమా రోగులకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్లా ఉపయోగపడే ఎలక్ట్రిక్ నెబ్యులైజర్ మాస్క్‌ను అభివృద్ధి చేయాలన్నది ప్రస్తుతం నా ముందున్న కర్తవ్యం.
– కుంచాల శివనాగరాజు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

