Venkatramaiah Gari Taluka | కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను హృద్యంగా ఆవిష్కరిస్తూ రూపొందుతున్న ‘వెంకట్రామయ్య గారి తాలుకా’ చిత్రం జులై 17న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రం నుంచి ‘ఆడుకున్న దిక్కడే’ అనే మూడో లిరికల్ సాంగ్‌ను స్టార్ దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఇప్పుడు విడుదల చేసిన ‘ఆడుకున్న దిక్కడే’ పాట కూడా ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేలా ఉంటుందని, కథలోని ప్రధాన భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ గీతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో హీరోగా దినేష్ కుమార్ నటిస్తుండగా, దివిజ ప్రభాకర్ హీరోయిన్గా పరిచయమవుతోంది. కోమలి క్రియేషన్స్ పతాకంపై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సతీష్ ఆవాల దర్శకత్వం వహిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, తల్లిదండ్రుల ప్రేమ, స్వచ్ఛమైన భావోద్వేగాలతో నిండిన ఈ సుందరమైన చిత్రం జులై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.