నాలుగెకరాల్లో దానిమ్మ తోట వేశాను. మొదట్లో దిగుబడి బాగానే వచ్చింది. కానీ, ఇప్పుడు బ్యాక్టీరియా తెగులు వ్యాపించింది. కాయలపై మచ్చలు ఏర్పడి, పూర్తిగా కుళ్లిపోతున్నాయి. దిగుబడి, నాణ్యత బాగా తగ్గిపోయింది. నివారణ మార్గాలు చెప్పండి.
నర్సింహారెడ్డి, నల్గొండ.
దానిమ్మ రైతులకు ‘బ్యాక్టీరియా తెగులు’ పెద్ద సమస్యగా మారింది. ‘గ్జాంతోమోనస్ ఆక్సోనోపోడిస్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ తెగులు వ్యాపిస్తుంది. దానిమ్మ ఆకులు, కొమ్మలతోపాటు పండ్లను ఆశిస్తుంది. ఆకులపై అక్కడక్కడా చిన్నచిన్న మచ్చలు ఏర్పడి, వాటి చుట్టూ పసుపు రంగులో వలయాలు వస్తాయి. క్రమేపి ఒక దానితో ఒకటి కలిసిపోయి, పెద్దగా మారి ఆకులు రాలిపోతాయి. కొమ్మలు, కాండంపై ఏర్పడ్డ మచ్చల వల్ల అక్కడి కణజాలం కుళ్లిపోతుంది. చివరికి కొమ్మలు, కాండం విరిగిపోతాయి. కాయలపై ఏర్పడ్డ మచ్చల వల్ల కాయపై పెద్ద చీలికలు ఏర్పడి, అవి కుళ్లిపోతాయి.
నివారణ మార్గాలు :
దానిమ్మ మొక్కల ఎంపిక సమయంలోనే సరైన జాగ్రత్తలు పాటించాలి. సాగుకోసం రోగరహిత మొక్కలనే నాటాలి. మొక్కల మధ్య కనీస దూరాన్ని పాటించడం వల్ల తెగులు వ్యాప్తిని తగ్గించవచ్చు. కత్తిరింపుల సమయంలో డెటాల్, స్పిరిట్, సోడియం హైపోక్లోరైడ్ 1% ద్రావణంలో ముంచిన కత్తెరలనే ఉపయోగించాలి. తెగులు సోకిన కొమ్మలను రెండు ఇంచుల కింది వరకూ కత్తిరించి, ఆయా భాగాలకు బోర్డో పేస్టు పూయాలి. నేలపై రాలిన ఆకులు, తెగులు సోకిన కొమ్మలు, కాయలను తొలగించి కాల్చి వేయాలి.