అగ్ర కథానాయకుడు చిరంజీవిని మరో మలయాళ సినిమా ఆకర్షించింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ సినిమా ‘లూసీఫర్’ అనే మలయాళ చిత్ర రీమేక్‌గా తెరకెక్కుతున్నది. దీంతో పాటు మాలీవుడ్‌లో విజయవంతమైన ‘బ్రో డాడీ’ సినిమాను తెలుగులో పునర్నిర్మించేందుకు చిరు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో మోహన్‌లాల్ తండ్రి పాత్రలో నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఈ కామెడీ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కథల్లో ఇదొక కొత్త తరహా సినిమా అవుతుందని చిరంజీవి భావిస్తున్నారట. గతంలో ‘బ్రో డాడీ’ రీమేక్‌లో వెంకటేష్ రానా నటిస్తారనే ప్రచారమూ జరిగింది. అయితే వాళ్లిద్దరు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం ‘రానా నాయుడు’ అనే సిరీస్‌లో కలిసి నటిస్తున్నారు. చిరంజీవి చేతిలో ప్రస్తుతం తీరిక లేనన్ని సినిమాలున్నాయి. ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘భోళా శంకర్’, ‘గాడ్ ఫాదర్’, దర్శకుడు బాబీ మైత్రీ మూవీ మేకర్స్ సినిమాతో పాటు దర్శకుడు వెంకీ కుడుములతో ఓ చిత్రంలో నటిస్తున్నారు. మరికొందరు దర్శకులు ఈ అగ్ర హీరోతో సినిమాలు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో ‘బ్రో డాడీ’ రీమేక్ విషయంలోనూ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాలో చిరంజీవి నటిస్తే కొడుకు పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.