చిన్న సినిమాగా విడుదలై దేశమంతా నివ్వెరపోయే విజయాన్ని సాధించిన సినిమా ‘హనుమాన్ అంశ్’. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రెండు కోట్లతో నిర్మించగా, ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 360 కోట్లు రాబట్టింది. నిర్మాతకు అనూహ్య లాభాలు తెచ్చిపెట్టిన విషయంలో దంగల్, దురంధర్-2 సినిమాలను సైతం ఈ సినిమా దాటిపోయిందని చెప్పక తప్పదు. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షోబినా సత్య ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమైనట్టుగా గతంలో వార్తలొచ్చాయి. అయితే.. తాజాగా కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 9న ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ విడుదల కానున్నది. ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది నిజంగా శుభవార్తే.