నాలుగు గిన్నెల ఇత్తడి క్యారియర్లో.. అడుగున పెద్ద గిన్నెలో అన్నం, రెండో గిన్నెలో పప్పు, మూడో గిన్నెలో కూర లేదా పచ్చడి. నాలుగో గిన్నెలో పెరుగు. నాన్న సైకిలు ఎక్కే సమయానికి అమ్మ సర్దడం పూర్తయిపోయేది. ప్రతి వంటకంలోనూ ఉప్పూకారంతో పాటు మమకారాన్నీ జోడించేది అమ్మ.
సాయంత్రం కడగడానికి.. ఎంగిలి క్యారేజీని విప్పుతున్న సమయానికి.. పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థి మానసిక పరిస్థితి అమ్మది! ఏ ఒక్క కూర మిగిలిపోయి ఉన్నా అమ్మ మనసు చివుక్కుమనేది. నాన్న రిటైర్మెంట్ తర్వాత.. క్యారేజీ అటకెక్కింది. అమ్మ పోయాక, అసలు కనిపించకుండా పోయింది. కొత్తకోడలు తూకానికి వేసిందేమో!
ఇత్తడి క్యారేజీ చుట్టూ ముడిపడిన నోస్టాల్జియా ఇది. ఈ చిత్రానికి ప్రాణంపోసిన అమిత్ శ్రీవాత్సవ చెప్పినట్టు.. ‘మంచి పెయింటింగ్ మనం ఏం కోల్పోయామన్నదీ గుర్తుచేస్తుంది’ (ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా చిత్ర ప్రదర్శనకు ఈ బొమ్మ ఎంపికైంది).