‘దాదా’ షూట్లో తగిలిన గాయం కారణంగా గత కొన్ని రోజులుగా విశ్రాంతిలో ఉన్న అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ.. మళ్లీ ఆ సినిమా షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టారు. దర్శకుడు మలినేని గోపీచంద్ మైసూర్లో ఈ సినిమా షూటింగ్‌ని పునఃప్రారంభించారు. ఈ లెన్తీ షెడ్యూల్లో కీలకమైన టాకీపార్ట్‌ని పూర్తి చేయనున్నారు. బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, మంచు మనోజ్‌లతోపాటు ముఖ్య తారాగణం ఈ షూటింగ్లో భాగం కానున్నట్టు తెలిసింది. కథను కీలకమైన మలుపు తిప్పే ఓ భారీ సన్నివేశాన్ని ఈ షెడ్యూల్లో తొలుత చిత్రీకరిస్తారు.
తీవ్రమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఈ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. బ్లాక్‌బస్టర్ ‘వీరసింహారెడ్డి’ తర్వాత మలినేని గోపీచంద్, బాలకృష్ణ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ైస్టెలిష్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అండర్‌వరల్డ్ డాన్‌గా, ‘ది కింగ్ ఆఫ్ కెయాస్’గా ఈ సినిమాలోని బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన గ్లింప్స్.. సినిమాపై అంచనాలు పెంచింది. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదలకానున్న ఈచిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: అరవింద్ ఎస్ కశ్యప్, సంగీతం: తమన్, నిర్మాత: వెంకటసతీశ్ కిలారు, నిర్మాణం: వృద్ధి సినిమాస్.