శ్రీరామ్, అవికాగోర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘10 క్లాస్ డైరీస్’. ఈ చిత్రాన్ని అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు, పి. రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ‘గరుడవేగ’ అంజి దర్శకుడు. జూలై 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…‘తెలంగాణ ప్రభుత్వం సినీ రంగానికి పూర్తి సహకారం అందిస్తున్నది. అందుకు ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు. ఈ చిత్ర సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పనిచేశారు. సినిమాకు రావాల్సిన క్రేజ్ తీసుకొస్తున్నారు. శ్రీరామ్ ఎంచుకునే సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి. ఆయన సినిమాలు చూస్తుంటాను. ఇందులో అవికా గోర్, హిమజ మంచి పాత్రల్లో నటించారు.
ఈ సినిమా చూస్తుంటే నా మొదటి సినిమా ‘హ్యాపీ డేస్’ గుర్తొస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. హీరో శ్రీరామ్ మాట్లాడుతూ..‘నటుడిగా నాకిది పునర్జన్మ. ‘ఒకరికి ఒకరు’ తర్వాత మళ్లీ ఒక మంచి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. ‘స్వామి రారా’ సినిమా తమిళ రైట్స్ నేనే కొన్నా. ఆ చిత్ర హీరో నిఖిల్ మా కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూసి ‘96’, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ చిత్రాల్లా ఉన్నాయని చెబుతున్నారు. అలాంటి ఫీల్‌గుడ్ సినిమాలతో పోల్చడం సంతోషంగా ఉంది.
ప్రతి ఒక్కరికి విద్యార్థి జీవితంలోని అనుభూతులు గుర్తు తెస్తుందీ సినిమా. అంజి సినిమాటోగ్రాఫర్‌గా తెలుసు. ఈ చిత్రంతో దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు. రామారావు నిర్మాతగానే కాదు కథకుడిగానూ విజయం సాధిస్తారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు శ్రీనివాసరెడ్డి, శివ బాలాజీ, దర్శకుడు బి గోపాల్, ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సినిమాటోగ్రాఫర్స్ కెకె సెంథిల్ కుమార్, పీజీ విందా, సి. రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.