ఉనా: ఉత్తరప్రదేశ్(Uttarpradesh)కు చెందిన ఓ కుటుంబం శక్తిపీఠాల దర్శనం కోసం హిమాచల్ ప్రదేశ్ టూరు వెళ్లింది. అయితే ఉనావ్ జిల్లాలోని అంబ్ ఏరియా వద్ద టీ బ్రేక్‌లో భాగంగా ఓ దాబా వద్ద ఆగారు. బ్రేక్‌ఫాస్ట్ ముగిసిన తర్వాత ఆ కుటుంబం టెంపో ట్రావెలర్ ఎక్కి వెళ్లిపోయింది. కానీ దాబా వద్ద కుమారుడిని వదిలేసిన విషయాన్ని మరిచిపోయారు. దాబా వద్ద ఒంటరిగా కూర్చున్న చిన్నారి.. కాసేపటి తర్వాత ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో దాబా ఓనర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాబాకు చేరుకున్న పోలీసులు ఆ పిల్లోడిని తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ పిల్లోడు ఎలా దాబాకు వచ్చాడో తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది.
అంబ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫూటేజ్‌ను అధికారులు చెక్ చేశారు. ఆ దాబా నుంచి వెళ్లిన వాహనాలను ట్రాక్ చేశారు. దీంతో టెంపో వాహనాన్ని గుర్తించారు. ఆ వెహికిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా.. దాని ఓనర్‌తో కాంటాక్ట్ అయ్యారు. ఆ తర్వాత డ్రైవర్‌కు ఫోన్ చేశారు. దాబా వద్ద చిన్నారిని వదిలి వెళ్లినట్లు సమాచారం ఇవ్వడంతో.. అప్పుడు ఆ ఫ్యామిలీ తమ పిల్లవాడు లేడని గమనించారు. కానీ ఈ లోగా సుమారు 80 కిలోమీటర్ల దూరం ఆ ఫ్యామిలీ ప్రయాణించింది. అయితే పిల్లోడి కోసం వాళ్లు మళ్లీ వెనక్కి వచ్చి తీసుకెళ్లారు.
పిల్లవాడిని సురక్షితంగా ఫ్యామిలీకి అప్పగించినట్లు అంబ్ డీఎస్పీ అనిల్ పాటియాల్ తెలిపారు.