న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఒకప్పుడు పెండ్లి సంబంధాలు అంటే ఒకరి ఇండ్లకు మరొకరు వెళ్లి మాట్లాడుకోవడం ఉండేది. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. వరుడు, వధువుల కోసం వేట ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నది. ఈ క్రమంలో వరుడు కావాలి.., వధువు కావాలి.. అంటూ వస్తున్న కొన్ని మాట్రిమోనియల్ ప్రకటనలు పాపులర్‌గా మారుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరలవుతున్నది. ‘సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయితే ఫోన్ చేయొద్దు..’ అంటూ అందులో ప్రత్యేకంగా పేర్కొనడమే దీనికి కారణం. ధనిక వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్న ఎంబీఏ చదివిన అమ్మాయికి ఐఏఎస్/ఐపీఎస్ లేదా డాక్టర్, వ్యాపారవేత్త/పారిశ్రామికవేత్త అయిన అబ్బాయి కావాలని ప్రకటన ఇచ్చారు. చివరిలో ‘సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయితే దయచేసి కాల్ చేయొద్దు’ అంటూ ప్రత్యేకంగా చెప్పడం కొసమెరుపు. ఈ ప్రకటనపై నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. సమీర్ అరోరా అనే వ్యక్తి ఈ ప్రకటనకు సంబంధించిన క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ ‘ఐటీ భవిష్యత్తు మంచిగా కనిపించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. మేం అంత చెడ్డవాళ్లమా.. అంటూ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.