ఇండోర్: ప్రమోషన్ కోసం బాస్‌తో పడుకోవాలని ఒక వ్యక్తి తన భార్యను బలవంతం చేశాడు. అతడి సోదరుడు కూడా పలుమార్లు ఆమెను లైంగికంగా వేధించాడు. టార్చర్ భరించలేకపోయిన ఆ మహిళ చివరకు కోర్టును ఆశ్రయించింది. దీంతో భర్త, అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఒక మహిళకు మహారాష్ట్రలోని పూణే జిల్లాకు చెందిన అమిత్ ఛబ్రాతో వివాహమైంది. అయితే పెళ్లైన తర్వాత అమిత్‌కు చెడ్డ వ్యక్తులతో సహవాసం పెరిగింది. దీంతో భార్యల మార్పిడికి (wife swapping ) సహకరించాలని, ప్రమోషన్ కోసం బాస్‌తో పడుకోవాలని భార్యను బలవంతం చేశాడు. అలాగే అమిత్ సోదరుడు కూడా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగికంగా వేధించాడు. ప్రతిఘటించిన ఆమెను దారుణంగా కొట్టాడు. విసిగిపోయిన ఆ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమెపై లైంగిక వేధింపులు తగ్గలేదు.
కాగా, భర్త, అత్తింటి కుటుంబం వేధింపులు భరించలేని ఆ మహిళ గత ఏడాది ఆగస్ట్‌లో ఇండోర్‌లోని పుట్టింటికి తిరిగి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత తన బాధను తల్లికి చెప్పుకుంది. చివరకు తల్లి అండతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇండోర్ పోలీసులు అమిత్‌ను పిలిపించారు. అయితే ఇకపై తన భార్యను వేధించనంటూ లిఖితపూర్వకంగా అతడు హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి భర్త ఇంటికి వెళ్లింది.
కొంత కాలం తర్వాత ఆ మహిళకు మెట్టింట్లో వేధింపులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఇండోర్ కోర్టును ఆశ్రయించారు. దీంతో మహిళా సంక్షేమ అధికారిణితో దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ మహిళపై వేధింపులు నిజమేనని దర్యాప్తులో తేలింది. దీంతో కోర్టు ఆదేశంతో ఆమె భర్త, అతడి సోదరుడు, అత్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.