బప్పి లహరి అనగానే.. ఒత్తైన జుత్తుతో ఒంటినిండా బంగారు నగలతో దర్శనమిచ్చే నిండైన శరీరం మన కండ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. తన రాక్, డిస్కోతో బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన బప్పీ లహరిని డిస్కో పాటల రారాజుగా కీర్తిస్తారు. ఆయన పాటలతో ఎంత ప్రత్యేకతను సంపాదించుకున్నారో.. అంతే ప్రత్యేకతను తన బంగారు నగలతో ఆపాదించుకున్నారు.
భారతీయులు ఎంతగానో అభిమానించే బప్పి లహరి.. అమెరికన్ రాక్ స్టార్ ఎల్విస్ ప్రెస్లీకి వీరాభిమాని. ఎల్విస్ ఎప్పుడు ప్రదర్శనలు నిర్వహించినా బంగారు గొలుసులు ధరించేవాడు. అలాగే, తన కోసం ప్రత్యేకంగా బంగారు సూట్‌ను కూడా ప్రెస్లీ కుట్టించుకున్నారు. ఎల్విస్ను చూసి బప్పి దాదా ప్రేరణ పొందినట్లు చాలా సార్లు చెప్పారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోవడానికి ప్రత్యేకత ఉండాలని నమ్మిన బప్పి లహరి.. అప్పటి నుంచి బంగారం నగలు ధరించడం ప్రారంభించారు. ఈయన ధరించే బంగారం కారణంగా ‘గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలిచేవారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన బప్పి లహరి.. నామినేషన్ ఆఫిడవిట్లో తన నికర ఆస్తుల విలువను వెల్లడించారు. తన వద్ద మొత్తం 752 గ్రాముల బంగారం, 4.62 కిలోల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.51 వేలు కాగా, బప్పి వద్ద ఉన్న బంగారం విలువ దాదాపు రూ.40 లక్షల వరకు ఉంటాయి. ఈయన ఆస్తి మొత్తం రూ.20 కోట్ల వరకు ఉంటుందని ఒకానొక సందర్భంగా మీడియాకు వివరించారు. బప్పి మాదిరిగేనే అతడి భార్య చిత్రాణి లహరికి కూడా బంగారం, వజ్రాలు అంటే చాలా ఇష్టం. 2014లో తన వద్ద 967 గ్రాముల బంగారం, 8.9 కిలోల వెండి, వజ్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.