వెండితెరపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాలో పారా అథ్లెట్‌గా అతని నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఆ పాత్ర అంత సహజంగా పండటం వెనుక ఓ అసలైన అంతర్జాతీయ పారా అథ్లెట్ నిశ్శబ్ద సహకారం దాగి ఉంది. చిత్రంలో పాత్రకు తగిన బ్లేడ్ (కృత్రిమ కాలు), రన్నింగ్ శైలి కోసం దర్శకుడు బుచ్చిబాబు.. భారత తొలి బ్లేడ్ రన్నర్ అయిన చల్లా పవన్ కుమార్‌ను ప్రత్యేకంగా షూటింగ్ సెట్స్‌కు పిలిపించాడు. సినిమాలో రామ్ చరణ్ సింథటిక్ ట్రాక్‌పై పెట్టుకుని పరిగెత్తిన ఆ బ్లేడ్ స్వయంగా పవన్‌దే. పారా అథ్లెట్ ఎదుర్కొనే శారీరక ఇబ్బందులు, బ్యాలెన్సింగ్ టెక్నిక్స్‌ను పవన్ దగ్గరే అడిగి తెలుసుకున్న చరణ్ ఆ పాత్రకు నూటికి నూరు శాతం ప్రాణం పోశాడు. అయితే, వెండితెరపై ఒక పాత్ర గొప్పగా రావడానికి సహకరించిన రియల్ హీరో, హైదరాబాద్‌కు చెందిన పవన్ కుమార్ బతుకు పరుగులో మాత్రం మలుపులు, గెలుపులు, అలుపుసొలుపులు ఎన్నో..

Challa Pawan
పవన్ కుమార్ బాల్యం నుంచే ఫైటర్ పైలట్ కావాలని, దేశ సరిహద్దులను కాపాడాలని కలలు కన్నాడు. కానీ, 17 ఏండ్ల వయసులో 2005 ఆగస్టులో జరిగిన ఓ ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. లారీ కిందపడి కుడి కాలు పూర్తిగా నలిగిపోవడంతో, ప్రాణాలు కాపాడటానికి వైద్యులు మోకాలి కింది వరకు కాలును తొలగించారు. పైలట్ కలలు కరిగిపోయి చీకట్లోకి జారుకుంటున్న తరుణంలో, సినిమా సౌండ్ ఇంజినీర్ అయిన తండ్రి శ్రీనివాస్ శాస్త్రి ఇచ్చిన ప్రోత్సాహం పవన్‌ను తిరిగి నిలబెట్టింది. డాక్టర్లు అమర్చిన కృత్రిమ కాలుతోనే ప్రయాణం మొదలుపెట్టాడు. మారథాన్లలో పాల్గొనేందుకు వీలుగా కార్బన్ ఫైబర్ బ్లేడ్ అమర్చుకొని అలుపెరగని పరుగు అందుకున్నాడు.
ప్రిస్టోరియస్ స్ఫూర్తితో..
ప్రముఖ అంతర్జాతీయ బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ స్ఫూర్తితో పవన్ పారా అథ్లెట్‌గా బ్లేడ్ రన్నింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఎవరిపైనా ఆధారపడకుండా సొంత ఖర్చులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రేసింగ్ బ్లేడ్‌ను కొనుగోలు చేసి ట్రాక్ ఎక్కాడు. ఆరంభంలో సరైన కోచ్ లేకపోయినా ఆర్మీ, పోలీస్ అభ్యర్థులతో కలిసి కఠిన ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ పర్యవేక్షణలో రాటుదేలాడు. 2014 ఏప్రిల్‌లో చైనాలోని బీజింగ్‌లో జరిగిన ఐపీసీ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రి పోటీల్లో 100 మీటర్ల పరుగులో రజత పతకం, 200 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించాడు. ఈ విజయాలతో పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అతణ్ని అధికారికంగా భారత తొలి బ్లేడ్ రన్నర్‌గా గుర్తించింది.

challa Pawan
మద్దతు కరువై ఆట ముగించి
అద్భుత ప్రతిభతో 2014 పారా ఆసియా క్రీడలకు అర్హత సాధించిన పవన్‌ను క్రీడా రాజకీయాలు తీవ్రంగా కుంగదీశాయి. అర్హత పత్రాలు చేతికి అందినప్పటికీ ఉత్తరాది వాళ్లకు అవకాశం ఇచ్చేందుకు అప్పటి క్రీడాధికారులు ఏవో కుంటిసాకులతో అతణ్ని అడ్డుకున్నారు. అయినా పట్టువదలకుండా 2016 రియో పారా గేమ్స్ క్వాలిఫికేషన్ కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ప్రాక్టీస్ సమయంలో దురదృష్టవశాత్తూ రేసింగ్ బ్లేడ్ లూజ్ అయి ఫ్రాక్చర్ అవ్వడంతో కింద పడిపోయాడు.
ఆ ప్రమాదంలో తీవ్ర గాయమై కాలు విపరీతంగా వాచిపోయినా దేశం కోసం పరుగెత్తాలని చూశాడు. కానీ, ఉన్న కాలు కూడా పూర్తిగా పాడవుతుందని డాక్టర్లు హెచ్చరించడంతో, ఆసుపత్రి పాలై భారంగా తన పరుగు ఆపాడు. ప్రొఫెషనల్ రేసింగ్ బ్లేడ్ల ధర సుమారు రూ. 4.5 లక్షల వరకు ఉంటుంది. ఒకసారి వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు చందాలు వేసి సాయం చేశారు. అప్పటి ప్రభుత్వం కొంత సాయం అందించింది. కానీ దీర్ఘకాలిక మద్దతు కరువై, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పవన్ 2020లో ఆటకు శాశ్వతంగా దూరమయ్యాడు.

Challa Pawan
భరోసా కోసం ఎదురుచూపులు
ప్రస్తుతం 38 ఏండ్ల వయసులో ఉన్న పవన్ కుమార్ మళ్లీ ట్రాక్ ఎక్కి పరుగెత్తలేడు. కుటుంబ పోషణ కోసం తండ్రి వారసత్వంగా సినిమా రంగంలో సౌండ్ మిక్సింగ్, డబ్బింగ్ పనులు చేసుకుంటూ బతుకు పోరాటం చేస్తున్నాడు. అయితే, పవన్ ఇప్పుడు ప్రభుత్వ మద్దతు అడుగుతున్నది తన స్వార్థం కోసం కాదు. భారత్‌కు తొలి బ్లేడ్ రన్నర్‌గా అంతర్జాతీయ పతకాలు సాధించిన తనకు తగిన గుర్తింపు దక్కితే, అది భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలుస్తుందని నమ్ముతున్నాడు. వెండితెరపై కృత్రిమ కాళ్లతో పరిగెడుతూ చప్పట్లు కొట్టించే కల్పిత పాత్రల కంటే.. నిజ జీవితంలో వైకల్యాన్ని, వ్యవస్థల వివక్షను, ఆర్థిక కష్టాలను తన గుండె నిబ్బరంతో ఓడించి ఒంటికాలిపై నిలబడ్డ చల్లా పవన్ కుమారే ఈ సమాజానికి అసలైన రియల్ హీరో. దేశానికి పతకాలు తెచ్చిన చేతులు, బతుకుదెరువు కోసం దేవురించకూడదు… ఈ పోరాట యోధుడికి వ్యవస్థ అండగా నిలవాలి!
‘ఈ వయసులో నేను మళ్లీ ట్రాక్ పైకి రాలేను. కానీ, దేశం కోసం పతకాలు తెచ్చిన నాకు ప్రభుత్వం అండగా నిలబడితే… నాలాంటి ఎంతోమంది దివ్యాంగులు ధైర్యంగా క్రీడల్లోకి వస్తారు. ఒక పతక విజేతకే సరైన గుర్తింపు, జీవిత భద్రత లేకపోతే కొత్తవాళ్లు ఆటల్లోకి రావాలంటేనే భయపడతారు. భవిష్యత్ క్రీడాకారుల్లో ఆ భరోసా నింపడం కోసమైనా నాకు సరైన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నా’
– చల్లా పవన్ కుమార్
…? రత్నగారి కృష్ణారెడ్డి
9493228456

Challa Pawan