పదేండ్లుగా ఏటేటా తెలుగునాట ప్రతి ఇంటా భాగమైపోయిన రియాల్టీ గేమ్ షో ‘బిగ్ బాస్’ (బి.బి) మళ్లీ వచ్చేసింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలుగుతో పాటు కన్నడం, తమిళం, మలయాళాల్లోనూ ‘బిగ్ బాస్’ సీజన్లు అన్నీ ఒకే రోజున (సెప్టెంబర్ 6) ఆరంభించింది ‘జియో-హాట్ స్టార్’. తెలుగులో ఎప్పటిలానే హీరో నాగార్జున యాంకర్ అవతారమెత్తితే, కన్నడంలో సుదీప్, తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో మోహన్ లాల్…వేడి పుట్టిస్తున్నారు. మొత్తం దక్షిణాది మార్కెట్‌ను రాగల 100 రోజుల పాటు షేక్ చేయాలన్నది వ్యూహమా? ఈ నేపథ్యంలో ‘జియో-హాట్ స్టార్’ దక్షిణాది విభాగం ఎంటర్టైన్మెంట్ హెడ్ కృష్ణన్ కుట్టి హైదరాబాద్ వచ్చారు. ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనతో ‘బిగ్ బాస్’ నుంచి మన దక్షిణాది ‘బిగ్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్’ దాకా అనేక అంశాలపై జరిపిన లోతైన భేటీ నుంచి కొన్ని ముఖ్యాంశాలు..
ఇప్పటికే ఎడిటింగ్, డబ్బింగ్, గ్రాఫిక్స్… ఇలా చాలా వాటిలో ఏఐ వాడకాన్ని ప్రయత్నిస్తున్నారు. పాతికేండ్ల క్రితం ఎకౌంట్స్‌కు ‘ఎక్సెల్ షీట్’ వాడితే, అలాగే ఏదైనా అన్వేషణకు ‘గూగుల్ సెర్చ్’ వాడితే తప్పు అనీ, తెలివితేటలు తగ్గుతాయనీ భావన ఉండేది. మరి ఇవాళ వాటిని వాడనివాళ్లు అంటూ ఎవరైనా ఉన్నారా! లేరు కదా! ఏఐ వాడకం కూడా అంతే!! ఇవాళ పాత్రలు, కథా కల్పనలోనూ ఏఐ వచ్చింది. ఏఐ వాడకం తప్పేమీ కాదు… కానీ మనిషి మేధకు ప్రత్యామ్నాయం ఏఐ అనుకుంటేనే పొరపాటు. ఏఐని తెలివిగా వాడుకోవడంలోనే మనిషి తెలివితేటలున్నాయి.

Krishnan Kutty
ప్రశ్న: పదేండ్లుగా ‘బిగ్ బాస్’ వస్తున్నా ఎన్నడూ లేనిది ఇంటర్వ్యూకి అంగీకరించారే!
జవాబు: టీవీ, ఓటీటీ (జియో-హాట్ స్టార్) వీక్షకుల కోసం ‘బిగ్ బాస్’ అనే ఓ అద్భుతమైన కన్జ్యూమర్ ప్రొడక్ట్‌ను అందించాం. ఇవాళ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ ఫ్రాంఛైజెస్లో ఒకటి ఇది. ఇవాళ దేశమంతా వివిధ భాషల్లో కోట్లాది జనం చూస్తూ, మాట్లాడుకొనే అతి పెద్ద షో ఇది. ఎంతోమంది ప్రతిభావంతులను ప్రపంచం ముందుకు తెచ్చిన షో కూడా ఇదే. కానీ, ఇప్పటికీ మీడియా ‘బిగ్ బాస్’ విజయాల గురించి మాట్లాడాల్సినంత మాట్లాడటం లేదేమో అనిపిస్తున్నది. అందుకే, ఈసారి మేము ముందుకొచ్చి, మాట్లాడుతున్నాం.
ఈసారి దక్షిణాది భాషలు నాలుగింటిలోనూ ఒకేరోజు ‘బిగ్ బాస్’ స్టార్ట్ చేశారే!
అవును.. తొలిసారిగా ఈ ప్రయోగం చేస్తున్నాం. ఇకపై యేటా సెప్టెంబర్ మొదటి వారమనేది గుర్తుండిపోయేలా, దక్షిణ భారతీయ వీక్షకులకు ఓ పండుగ లాగా ఒకేసారి ప్రారంభించాం. పైగా, ‘హాట్ స్టార్’ వ్యూయర్స్‌లో మూడింట ఒకవంతు మంది దక్షిణాది నుంచే!
అన్ని భాషల్లో ఒకేసారి అందించడమంటే చాలా ప్లానింగ్, శ్రమ కదా!
సర్వసాధారణంగా ‘బిగ్ బాస్’- మలయాళం ఆగస్టులో మొదలవుతుంది. తెలుగు సెప్టెంబర్‌లో, తమిళంకన్నడ వెర్షన్లు అక్టోబర్‌లో మొదలవుతాయి. అలా మధ్యలో కొద్దిగా విరామంతో, నాలుగు వెర్షన్లూ మూడు నెలల్లో విస్తరించి ఉంటాయి. కానీ, ఈసారి అన్ని దక్షిణాది భాషల్లోనూ సెప్టెంబర్ 6నే ఆరంభమయ్యాయి. అందుకే, కొద్దిగా నెర్వస్‌గా ఉంది. అదే సమయంలో ఎగ్జయిటింగ్గానూ ఉంది.
కానీ, లాజిస్టికల్ ఇబ్బందులు కూడా ఉంటాయేమో?
లేదు లేదు… అలాంటి సమస్యలేమీ రాకుండా పక్కాగా ప్లాన్ చేశాం. ‘బిగ్ బాస్’ రూపకల్పనలో ‘బాణీజయ్’ సంస్థ గ్రేట్ ప్రొడక్షన్ పార్ట్నర్. అది కాక… గతంలో వివిధ మార్కెట్లన్నిటికీ ఒకే టీమ్స్ పనిచేసేవి. కానీ, ఇప్పుడు ప్రతి మార్కెట్‌కూ విడివిడిగా టీమ్స్ ఏర్పాటుచేశాం. దానివల్ల అంతా సాఫీగా సాగుతుంది. నిజానికి, ‘బిగ్ బాస్’ షో అంటే… కేవలం తెర మీద కనిపించే 10 15 మందే కాదు. కెమెరా, టెక్నికల్, ఎడిటింగ్, వగైరా అనేక విభాగాలలో కలిపి దాదాపు 200 నుంచి 250 మంది తెర వెనుక అండగా పనిచేస్తుంటారు.
పదేండ్ల క్రితం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో మొదలెట్టినప్పుడు ఈ షో ఈ స్థాయికి చేరుతుందనుకున్నారా?
2017లో మేము తెలుగులో ప్రారంభించినప్పుడు ఈ షో భారీ స్థాయిలో నిలుస్తుందనీ, మా వ్యాపారానికి ఉపకరిస్తుందనీ అనుకున్నాం. అయితే, వీక్షకుల నుంచి, మార్కెట్ నుంచి ఈ స్థాయి ప్రేమ, ఆదరం లభిస్తాయనీ, మాకు ఇది ఎప్పటికీ నిలిచిపోయే షో అవుతుందనీ ఊహించలేదు. ఏ ఏటికాయేడు మా అంచనాలను మించి, కొత్త విషయాలు నేర్చుకొనేలా చేసింది.
ఇన్నేండ్లుగా ఏటా వస్తుంటే జనానికి షో బోర్ కొట్టదంటారా?
మీరన్నది నిజమే. ఒక షో పది సీజన్లు నడవడం అంత ఈజీ కాదు. చెప్పాలంటే, తెలుగు కన్నా ముందే కన్నడంలో మొదలైంది. అక్కడ ఇది 13వ సీజన్. తెలుగు-తమిళం దాదాపు ఒకే సమయంలో కొద్ది వారాలు అటూ ఇటూగా వచ్చాయి. మలయాళ బి.బి. మాత్రం ఆలస్యంగా మొదలైంది. అక్కడ రానున్నది 7వ సీజన్. ఇన్ని సీజన్లు నడుస్తుంటే, ఏ షో అయినా కొంత మందగతిలో పడుతుంది. కానీ, బి.బి. అంతకంతకూ వేగం పుంజుకుంటున్నది.
తెలుగులో కొన్ని సీజన్లకు ఆదరణ తగ్గింది. మళ్లీ ఎలా గాడిలో పడ్డారు?
‘బిగ్ బాస్’ అనేది ముందే స్క్రిప్టు రాసుకొని, దాన్ని చిత్రీకరించే షో కాదు. అది అప్పటికప్పుడు, అక్కడికక్కడ జరిగినది కెమెరాలో బంధించే రియాల్టీ గేమ్ షో. అందులో ఎవరూ పాత్రధారులు, యాక్టర్లు కాదు. రియల్ కంటెస్టెంట్స్. వీక్షకులకు కొన్నిసార్లు ఆ కంటెస్టెంట్లు, వారి కథలు ఆసక్తిగా అనిపిస్తాయి. అనిపిస్తే… షో హిట్. అనిపించకపోతే ఫట్. ఇన్ని భాషల్లో, ఇన్ని సీజన్ల తర్వాత మాకు అర్థమైంది ఏమిటంటే, విభిన్న నేపథ్యాలకు చెందిన కంటెస్టెంట్లు షోలో ఉండాలి. కొత్త ప్రయోగాలతో బి.బి. హద్దుల్ని విస్తరించుకుంటూ వచ్చాం.
సామాన్య కంటెస్టెంట్ల ఎంపికకై పెట్టిన ‘అగ్నిపరీక్ష’ అలాంటిదే అనుకోవచ్చా?
యస్. గడిచిన 2025లో, అదీ తెలుగులోనే ఆ ఫార్మట్ ప్రయోగం చేశాం. అది మా ఊహలకు మించి విజయం సాధించింది. ఆ ‘అగ్నిపరీక్ష’ ప్రక్రియ ద్వారా మేము షోలోకి తీసుకున్న కామన్ మ్యాన్ కంటెస్టెంట్లను వీక్షకులను ఎంతగానో అభిమానించారు, ఆదరించారు. చివరకు ఆ సీజన్లో కామన్ మ్యాన్ కంటెస్టెంటే విజేత అయ్యాడు. కాబట్టి, ఎప్పటికప్పుడు పాత మూసను బద్దలుకొట్టి కొత్తదనం కోసం ప్రయత్నించాలి.
‘అగ్నిపరీక్ష’ అనే పేరు నిరుడు పెట్టారు కానీ, కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు గతంలోనూ ఉన్నారుగా?
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి మొదట్లో సెలెబ్రిటీలను తీసుకున్నాం. అభ్యర్థుల్లో వాళ్లకు పెద్ద పీట వేశాం. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకున్నాం. ఇప్పుడు కామన్ మ్యాన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. గతంలో మేమే అలాంటి వారి కోసం వెతికి, వారిని కలిసి, మాట్లాడి, ఎంపిక చేసుకొనేవాళ్లం. అదే సమయంలో కొన్ని వేలమంది సామాన్యులు తాము పాల్గొంటామని మెయిల్స్ రాస్తుంటారు, వీడియోలు పంపిస్తుంటారు. వాటన్నిటినీ చూసి, పరిశీలించి, తుది జాబితా కోసం 2025 నుంచి ప్రత్యేకంగా ‘అగ్నిపరీక్ష’ అనే పేరుతో కామన్ మ్యాన్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నాం. ఈ ‘అగ్నిపరీక్ష’ ఆలోచన పూర్తిగా తెలుగు టీమ్ రాఘవ, శ్యామ్ తదితరుల ఘనతే. ఈ ఏడాది సీజన్ నుంచి అదే ప్రక్రియను మిగతా దక్షిణాది భాషల ‘బిగ్ బాస్’ షోలలో కూడా ప్రవేశపెట్టాం.
కానీ అన్ని ప్రయోగాలూ, అన్నిసార్లూ సక్సెస్ అవుతాయనేమీ లేదుగా?
లేదు. ఇది క్రియేటివ్ ప్రొఫెషన్. ఇందులో కొన్ని సీజన్లు బ్రహ్మాండంగా నడుస్తాయి. మరికొన్ని సీజన్లు గొప్పగా నడవకపోవచ్చు. అది సహజమని గ్రహించాలి. ప్రయోగాలు చేయడం మానకూడదు.
కానీ, మన సంస్కృతికి చేటు చేస్తోందని ‘బిగ్ బాస్’పై విమర్శలున్నాయి!
(ఒక్క క్షణం ఆగి…) ‘బిగ్ బాస్’, మరీ ముఖ్యంగా దక్షిణాది భాషల్లోని షో విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇంటిల్లిపాదీ కలసి చూసి, ఆనందించేలా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. పదేండ్ల నుంచి 50 ఏండ్ల పైబడిన వాళ్ల దాకా అందరినీ ఆకట్టుకోవడం మా లక్ష్యం. అఫ్ కోర్స్… ఇవాళ యువతరం అతి పెద్ద వినియోగదారులు. వారిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. ఇవాళ మీరు ఏ ఇంటికి వెళ్లినా, టీవీలో ‘బిగ్ బాస్’ మోగుతూనే ఉంటుందని మర్చిపోవద్దు. అయితే ఒక విషయం. బి.బి. ఓ రియాల్టీ షో. అక్కడికక్కడ బి.బి. హౌస్‌లో ఏదైనా ఘర్షణ, ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తవచ్చు. అలాంటప్పుడు ఠక్కున రంగంలోకి దిగి, సున్నితంగా, న్యాయబద్ధంగా ఆ అంశాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటాం.
బి.బి.లో జరిగేదంతా స్టేజ్ మేనేజ్డ్ అనీ, ముందుగా స్క్రిప్టులో అనుకున్నట్టే అభ్యర్థులు చేస్తారనీ జనంలో ఓ టాక్.
(కాస్తంత అప్రసన్నవదనంతో…) ఇవాళ సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్నాం. మనం ఏం చేసినా, జనం నిత్యం విమర్శిస్తూనే ఉంటారు.
ఒకవేళ నిజంగానే ముందస్తు స్క్రిప్ట్ ప్రకారం అభ్యర్థులు నటించే షో అయితే, ఇంతకన్నా మెరుగైన స్టోరీలెన్నో రాసుకొని చేసేవాళ్లం కదా. అక్షరాలా ఇది రియాల్టీ షో. అంతెందుకు… ఇదేదో కేవలం ఒక గంట ఎపిసోడ్లో నాకు నచ్చింది జనానికి చూపించడం కాదు. ఇప్పుడు 24 గంటల ఫీడ్ ‘జియో-హాట్ స్టార్’ యాప్‌లో అందిస్తున్నాం. కాబట్టి, మీకు అనుమానం ఉంటే, ఏ క్షణంలోనైనా హౌస్‌లో ఏం జరుగుతోందో ఆ ఫీడ్ మొత్తం చూసుకోవచ్చు. ఇవేవీ పట్టించుకోకుండా ఊహాగానాలు, విమర్శలు చేయదలుచుకుంటే ఎవరేం చేయగలం! అలాంటి వాటికి జవాబివ్వాల్సిన పని లేదు.
రెంటాల జయదేవ