లండన్: కోవిడ్ టీకాల్లో ఏది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో ఇప్పుడు చెప్పడం కష్టం. కానీ తాజాగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. ఆస్ట్రాజెనికా ( Astrazeneca ) టీకా కన్నా ఫైజర్ టీకా త్వరగా శక్తిహీనమవుతుందని తేల్చారు. దానికి సంబంధించిన అధ్యయన నివేదికను గురువారం పబ్లిష్ చేశారు. రెండో డోసుల ఫైజర్ టీకా.. కోవిడ్ ఇన్ఫెక్షన్లపై సమర్ధవంతంగా పనిచేస్తుందని, కానీ ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా టీకాతో పోల్చితే, ఫైజర్ ప్రభావం త్వరగా నశిస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. బ్రిటన్‌కు చెందిన నేషనల్ స్టాటిస్టిక్స్ ఈ సర్వే నిర్వహించింది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఆగస్టు వరకు నిర్వహించిన పీసీఆర్ పరీక్షల ఆధారంగా ఈ ఫలితాలను వెల్లడించారు. రెండు వ్యాక్సిన్ల ద్వారా వచ్చే రోగనిరోధక శక్తిలో కూడా తేడా ఉన్నట్లు యూనివర్సిటీలోని నఫ్ఫీల్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ పేర్కొన్నది.
ఫైజర్ టీకా తీసుకున్నవారిలో తొలుత బలమైన రోగనిరోధక శక్తి వస్తోందని, కానీ వైరల్ లోడ్ పెరుగుతున్న సమయంలో ఆ టీకా శక్తి తగ్గుతున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. టీకాలు తీసుకున్న కొన్ని నెలల తర్వాత ఇలాంటి పరిణామం కనిపిస్తున్నట్లు చెప్పారు. ఫైజర్, ఆస్ట్రా టీకాలతో అయిదు నెలల వరకు ఒకేరకమైన ప్రభావం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అయితే టీకాల వల్ల వచ్చే దీర్ఘకాలిక దుష్ ప్రభావాలపై అధ్యయనం చేయాల్సి ఉందంటున్నారు.
ఇజ్రాయిల్‌లో 58 శాతం జనాభాకు ఇప్పటికే రెండు డోసుల ఫైజర్ టీకాలు ఇచ్చేశారు. అయితే అక్కడ డెల్టా వ్యాపిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసు వేయాలని నిర్ణయించారు. అమెరికాలో కూడా ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకున్నవారికి ఎక్స్ట్రా డోసు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైరస్ సోకిన వారిలో ఆస్ట్రా టీకాతో రక్షణ మరింత ఎక్కువ స్థాయిలో ఉంటుందని ఆక్స్ఫర్డ్ పరిశోధకులు తెలిపారు. సుమారు మూడు లక్షల మంది పరిశోధకులపై అధ్యయనం నిర్వహించారు. ఆల్ఫా, డెల్టా వేరియంట్లు వ్యాపిస్తున్న సమయంలో ఈ సర్వే జరిగింది. ఇక డెల్టా వేరియంట్‌పై కోవిడ్ టీకాలు తక్కువ ప్రభావాన్నే చూపుతున్నట్లు పరిశోధకులు నిర్ధారించారు.