Pete Hegseth : అమెరికా (USA) సైన్యాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పెంటగాన్ (Pentagon) మరో కీలక నిర్ణయం తీసుకుందని ఆ దేశ రక్షణ మంత్రి (Defence Minister) పీట్ హెగ్సేత్ (Pete Hegseth) ప్రకటించారు. యుద్ధ సామర్థ్యాన్ని పెంచే చర్యల్లో భాగంగా సైనికుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 30 ఏళ్లు దాటిన సైనికులకు హార్మోన్ పరీక్షల (Hormone tests) ను తప్పనిసరి చేస్తూ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు వెల్లడించారు.
పెంటగాన్ ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం.. యాక్టివ్ డ్యూటీ, రిజర్వ్ విభాగాల్లో పనిచేస్తున్న 30 ఏళ్లు పైబడిన సైనికులందరికీ టెస్టోస్టెరాన్ లోపం ఉందా..? లేదా..? అనే పరీక్ష తప్పనిసరిగా నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది జరిగే పీరియాడిక్ హెల్త్ అసెస్మెంట్లో ఈ పరీక్షను భాగంగా చేర్చారు. 30 ఏళ్లలోపు ఉన్న సైనికులు కోరితే స్వచ్ఛందంగా ఈ పరీక్ష చేయించుకునే అవకాశం కల్పించారు. రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సేత్ ఆదేశాల మేరకే ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు పెంటగాన్ ప్రధాన ప్రతినిధి షాన్ పార్నెల్ తెలిపారు.
సైనికుల్లో దీర్ఘకాలిక ఒత్తిడి, హార్మోన్ లోపం, శారీరక సామర్థ్యం తగ్గడం వంటి సమస్యల సమాహారం అయిన ‘ఆపరేటర్ సిండ్రోమ్’ సమస్యను ఎదుర్కోవడం, యుద్ధ సన్నద్ధతను మరింత బలోపేతం చేయడం ఈ నిర్ణయం వెనక ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ పరీక్షల ద్వారా సైనికుల ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర సమాచారం సేకరించనున్నట్లు పెంటగాన్ తెలిపింది. అవసరమైన వారికి టెస్టోస్టెరాన్ చికిత్స అందించి, సైనిక దళాన్ని ఆరోగ్యంగా, సమర్థంగా ఉంచాలని భావిస్తోంది.