Miracle Baby : బ్రిటన్‌లో అద్భుతం చోటుచేసుకుంది. క్యాన్సర్‌ను జయించిన దంపతులకు పండంటి బిడ్డ పుట్టింది. ఆ నవజాత శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉంది. దాంతో ఆ బేబీని మిరాకిల్ బేబీ అంటున్నారంతా. వొర్సెస్టర్ షైర్ ఆస్పత్రిలో బెథనీ అనే మహిళకు బిడ్డ పుట్టింది. బెథనీ దంపతులు బేబీతో ఉన్న ఫొటోలను ఆస్పత్రి యాజమాన్యం ఫేస్బుక్లో షేర్ చేసింది. ‘మిరాకిల్ బేబీ పుట్టింది. బేబీ గర్భంలో ఉండగానే తల్లిదండ్రులు ఇద్దరూ కీమోథెరపీ తీసుకున్నారు. జేమ్స్, బెథనీ ఇద్దరూ క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. వాళ్లకు ఇక ట్రీట్మెంట్ అవసరం లేదు’ అని ఆ పోస్టులో తెలిపింది.
పోయిన ఏడాది డిసెంబర్లో బెథనీ భర్త జేమ్స్ హడ్కిన్ లింఫోమా అనే క్యాన్సర్ వచ్చింది. దాంతో, ట్రీట్మెంట్కు ముందే వాళ్లు బిడ్డను కనాలనుకున్నారు. అనుకున్నట్టుగానే బెథనీ ప్రెగ్నెంట్ అయింది. గర్భం దాల్చిన సంతోషంతో ఉన్న బెథనీకి మూడు నెలల్లలోనే పిడుగులాంటి వార్త తెలిసింది. ఆమెకు కూడా నాన్-హడ్కిన్ లింఫోమా ఉన్నట్టు వైద్యులు నిర్థారించారు. దాంతో ఇద్దరూ కీమోథెరపీ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరూ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన పడేవాళ్లు. అయితే.. వాళ్లు భయపడినట్టు ఏమీ జరగలేదు. బెథనీ ఆరోగ్యంగా ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో, ఆ దంపతుల సంతోషానికి అవధులు లేవు.
గర్భంతో ఉన్న మహిళకు నాన్-హడ్కిన్ లింఫోమా రావడం అనేది చాలా అరుదు. నా 25ఏళ్ల కెరీర్లో బెథనీ లాంటి వ్యక్తికి ట్రీట్మెంట్ చేయడం ఇదే మొదటిసారి అని సలీం షఫీక్ అనే కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ తెలిపాడు.