మలక్‌పేట, ఏప్రిల్ 8: అనధికారికంగా ఇంజెక్షన్లను అధిక ధరలకు అమ్మేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్‌చేశారు. చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ బ్రహ్మ మురారి కథనం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం చాదర్‌ఘాట్ ఎస్ఐ భరత్‌కుమార్ తన సిబ్బందితో కలిసి పాత మలక్‌పేటలోని వాటర్ ట్యాంక్, వాహెద్‌నగర్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టగా, యాక్టీవా వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని గమనించి, వారిని ఆపి తనిఖీ చేయగా, ఏడు మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు, ఐదు సిరంజీలు, ఒక కత్తి లభించటంతో అదుపులోకి తీసుకొని విచారించారు.
ఈ ఇంజక్షన్లను తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు అమ్మేందుకు యత్నిస్తున్నట్లు నిందితులు తెలుపటంతో వారిపై కేసు నమోదుచేసి అరెస్ట్‌చేశారు. వారి వద్దనుంచి ఏడు మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు, ఐదు సిరంజీలు, ఒక కత్తి, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సరఫరాదారుడు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ భరత్‌కుమార్ తెలిపారు.