హైదరాబాద్: ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో జరుగుతున్న 4వ లిటిల్ స్టార్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్–2026లో భారత జిమ్నాస్ట్ అంజన గునుకుల (Anjana Gunukula) స్వర్ణ పతకం సాధించింది. హైదరాబాద్ మణికొండలోని జోయ్ జిమ్నాస్టిక్స్ అకాడమీ(JOE’s Gymnastics Academy)కి చెందిన అంజనా రిబ్బన్ ఈవెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. అంతర్జాతీయ వేదికపై పసిడి వెలుగులు విరజిమ్మిన అంజన మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
కేన్స్‌లో జూలై 3వ తేదీ నుంచి జరుగుతున్న 4వ లిటిల్ స్టార్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్–2026లో అంజన గునుకుల సత్తా చాటింది. రిబ్బన్ ఈవెంట్లో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి పసిడి పతకం కొల్లగొట్టింది. ఈ పోటీల్లో జోయ్ జిమ్నాస్టిక్స్ అకాడమీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.

అంతర్జాతీయ స్థాయిలో అంజన గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు, కోచ్ అలికా జో, జోయ్ జిమ్నాస్టిక్స్ అకాడమీ సభ్యులు, తోటి క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆశిస్తూ అంజనకు అభినందనలు తెలిపారు.