టీజీ సేఫ్ దాడులు
నగరంలో టీజీ సేఫ్ విస్తృత తనిఖీలు చేపట్టింది. మాంసం విక్రయ, ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు కరాచీ బేకరీ తయారీ యూనిట్లలో ఉల్లంఘనలను గుర్తించింది. ఈ దాడుల్లో మొత్తం రూ.6.59 లక్షల విలువైన 1,672 కిలోల ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు
- కరాచీ బేకరీలు సహా ఆరు సంస్థల లైసెన్స్‌లు సస్పెన్షన్
- ఐదు మాంసం దుకాణాలు మూసివేత
- 1,672 కిలోల ఆహార పదార్థాలు సీజ్
సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): నగరంలో టీజీ సేఫ్ విస్తృత తనిఖీలు చేపట్టింది. మాంసం విక్రయ, ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు కరాచీ బేకరీ తయారీ యూనిట్లలో ఉల్లంఘనలను గుర్తించింది. ఈ దాడుల్లో మొత్తం రూ.6.59 లక్షల విలువైన 1,672 కిలోల ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టీజీ సేఫ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగానికి చెందిన 11 బృందాలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బంది సంయుక్తంగా గ్రేటర్ పరిధిలోని మలాజిగిరి, గగన్ పహాడ్, ముషీరాబాద్, నల్లకుంట, సికింద్రాబాద్, మూసాపేట, సుచిత్ర, ఉప్పల్, ఎర్రగడ్డ, యూసుఫ్ గూడ, మాదాపూర్, గోషామహల్ ప్రాంతాల్లోని 15 మాంసం విక్రయ, ప్రాసెసింగ్ కేంద్రాలు, కరాచీ బేకరీకి చెందిన నాలుగు తయారీ యూనిట్లలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు కేంద్రాలను గుర్తించారు. అంతే కాకుండా మాంసం అవశేషాలు, రక్తపు మరకలతో నేలలు అపరిశుభ్రంగా ఉండటం, వాషింగ్ ప్రాంతాల్లో మురుగు పేరుకుపోవడం, గోడలపై మురికి, ఈగలు, బొద్దింకల బెడద, ఎలుకల సంచారం, ఆహార పదార్థాలపై తప్పుడు లేబుళ్లను అంటించడం వంటి ఉల్లంఘనలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఐదు మాంసం దుకాణాలు మూసివేత:
ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు లేకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో నిర్వహిస్తున్న నల్లకుంటలోని ఆనంద్ మటన్ అండ్ చికెన్ పాయింట్, ఎర్రగడ్డలోని సల్మాన్ కేజీఎన్ పౌల్ట్రీ, న్యూ డీసెంట్ మీట్ చికెన్ అండ్ ఫిష్ షాప్, సికింద్రాబాద్‌లోని ప్రోటీన్ ఫుడ్స్, మలాజిగిరిలోని ఏపీ ఫిషరీస్ ఫిష్ స్టాళ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మరో రెండు సంస్థలైన ముషీరాబాద్ లోని వతన్ ఫ్రెష్ మార్ట్, ఉప్పల్ లోని మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థలకు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్ మెంట్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో తీవ్ర ఉల్లంఘనలు గుర్తించిన పది సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించేందుకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
కరాచీ బేకరీలు సహా ఆరు సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్:
ఆహార పదార్థాల తయారీ, ప్యాకింగ్, నిల్వ ప్రాంతాల్లో అపరిశుభ్రత, యంత్రాల నిర్వహణలో లోపాలు, ఎలుకల వ్యర్థాలు, ఆహార పదార్థాల నిల్వలో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న కరాచీ బేకరీ తయారీ కేంద్రాలకు సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌లను సస్పెండ్ చేయడంతో పాటు వెంటనే వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని టీజీ-సేఫ్ అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా గగన్ పహాడ్‌లోని కరాచీ బేకరీ యూనిట్లో తయారీ, ప్యాకింగ్, నిల్వ ప్రాంతాల్లో అపరిశుభ్రత, యంత్రాల నిర్వహణలో లోపాలు, ఎలుకల వ్యర్థాలు, ఆహార పదార్థాల నిల్వలో నిబంధనల ఉల్లంఘనలే కాకుండా తయారీ తేదీల విషయంలోనూ తప్పుడు లేబుళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబర్‌లో తయారైన కొన్ని ప్యాకెట్లపై నవంబర్‌లో తయారైనట్లు ముద్రించడంతో రూ.4లక్షల 34వేల 813 విలువ చేసే 1,012 కిలోల ప్యాక్డ్ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్ కాలనీలోని కరాచీ ఐఎన్‌సీ యూనిట్లో శాకాహార, మాంసాహార పదార్థాలను ఒకే రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడం, ముడి పదార్థాలు, వండిన ఆహారాన్ని వేర్వేరుగా కాకుండా ఒకే చోట నిల్వచేయడం, వంటగదిలో డ్రైనేజీలు మూసుకుపోవడం వంటి లోపాలు గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఈ రెండు కరాచీ యూనిట్లతో పాటు ముషీరాబాద్‌లోని వతన్ ట్రేడర్స్, సికింద్రాబాద్‌లోని పంజాబ్ ఫిష్ కంపెనీ, హై ప్రోటీన్, ఉప్పల్‌లోని ఎస్ఎంసీ కార్పొరేషన్లకు చెందిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు సస్పెండ్ చేసి తక్షణమే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని అధికారులు సంస్థల యాజమన్యాలను ఆదేశించారు.
ప్రజారోగ్యానికి హాని కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో నిబంధనలు పాటించకుండా ప్రజారోగ్యానికి హాని కలిగిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తనిఖీల్లో గుర్తించిన లోపాలపై తదుపరి చర్యలు తీసుకోవడంతో పాటు, తిరిగి మళ్లీ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. రెండవ సారి కూడా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.
– కమిషనర్ అవినాష్ మహంతి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

