Ugadi Panchangam 2024 | శ్రీ క్రోధి నామ సంవత్సరం { Sri Krodhi Nama Samvatsara } ఫలితాలు
కలి గతాబ్ది: 5125, క్రీస్తుశకం: 2024-25, శాలివాహన శకం:1946, భారత స్వాతంత్య్ర శకం: 77-78
ఈ సంవత్సరానికి రాజు-కుజుడు, మంత్రి-శని, సేనాధిపతి-శుక్రుడు, సస్యాధిపతి-కుజుడు, ధాన్యాధిపతి-రవి, అర్ఘ్యాధిపతి-శుక్రుడు, మేఘాధిపతి-శుక్రుడు, రసాధిపతి-గురు, నీరసాధిపతి-కుజుడు, రాజవాహనం- నౌక, పశుపాలకుడు-యముడు, గోష్ఠాగార ప్రాపకుడు (స్థాన సంరకక్షుడు)- శ్రీకృష్ణుడు
రాజు కుజుడు కావడం వల్ల ఈ ఏడాది రెండు తూముల వర్షం కురుస్తుంది. సముద్రంలో 9 భాగాలు, పర్వతాల్లో 9 భాగాలు, భూమిపై 2 భాగాల వర్షం కురుస్తుంది. కుజుడు రాజు కావడం వల్ల లోకంలో అగ్నిభయం, శస్త్ర భయం పెరుగుతాయి. అల్పవృష్టి, పంటల దిగుబడి తగ్గుతుంది. చోరుల భయం పెరుగుతుంది. యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. ఎర్రని వస్తువులు, కందులు, మిర్చి, బెల్లం, కలప, బంగారం, వెండి, సీసం, ఇనుము, కంచు, ఇత్తడి, రాగి, యంత్ర పరికరాలు, బొగ్గు, పెట్రోలు, ఆముదం, జనపనార, ఉల్లిగడ్డలు, తేయాకు, కాఫీ గింజలు, పసుపు, సిమెంటు తదితర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి.
రాజ వాహనం నౌక కావడం వల్ల ప్రజల్లో కల్లోలం ఉంటుంది. ఆకలి బాధలు పెరుగుతాయి. పశువులకు అధిక నష్టం వాటిల్లుతుంది. దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి. ప్రజా రవాణా సౌకర్యం తగ్గుతుంది.
మంత్రి- శని: వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. పంట విస్తీర్ణం తగ్గుతుంది. పాలకులు ప్రజలను పీడిస్తారు. ధన, మాన, ప్రాణ హాని కలుగుతుంది.
సేనాధిపతి- శుక్రుడు: వర్షపాతం ఓ మోస్తరుగా ఉంటుంది. పత్తి, నూలు, దుస్తులు, బంగారం ధరలు పెరుగుతాయి. కామంపై ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు రక్షణ కరువవుతుంది.
సస్యాధిపతి- కుజుడు: కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు, ఎర్ర నేలలకు మంచి కాలం. మాగాణి పంటలు మధ్యమంగా పండుతాయి.
ధాన్యాధిపతి- రవి: వర్షాలు తక్కువగా ఉంటాయి. రాజకీయ క్రీడ రసకందాయంగా ఉంటుంది. సమాజంలో నైతికత లోపిస్తుంది. దుష్ట చింతన పెరుగుతుంది. కొబ్బరి కాయలు, మామిడి, పనస, అరటి తదితర పండ్ల ధరలు పెరుగుతాయి. బంగారం, వెండి ధరలు పెరిగి నిలకడగా ఉంటాయి.
అర్ఘ్యాధిపతి-శుక్రుడు: తెల్లని ధాన్యం బాగా పండుతుంది. బియ్యం, పట్టు, రాగి, దుస్తులు, పత్తి ధరలు అనుకూలంగా ఉంటాయి.
మేఘాధిపతి- శుక్రుడు: అతివృష్టి ఉంటుంది. కొన్ని పంటలు అధిక దిగుబడిని ఇస్తాయి. పాల ఉత్పత్తి పెరుగుతుంది.
రసాధిపతి- గురుడు: అవసరానికి వర్షాలు కురుస్తాయి. కొన్ని పంటలు సమృద్ధిగా పండుతాయి.
నీరసాధిపతి- కుజుడు: మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు తదితరాల ధరలు పెరిగి నిలిచి ఉంటాయి. అపర ధాన్యాల ధరలు హెచ్చుతాయి.
పశుపాలకుడు-యముడు: అల్పవృష్టి, పశువులకు రోగాది పీడలు అధికమవుతాయి.
గోష్టాగార ప్రాపకుడు, గోష్ఠాద్బహి ప్రాపకుడు- శ్రీకృష్ణుడు: పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి. ప్రజలకు క్షేమం చేకూరుతుంది.
నవనాయకుల ఫలితాలను క్రోఢీకరించి చూడగా.. క్రోధి నామ సంవత్సరం మిశ్రమంగా ఉంది. ప్రజలు రోగ పీడితులు అవుతారు. పాలకుడు లోభంతో వ్యవహరిస్తారు. ఈతి బాధలు పెరుగుతాయి. అల్పవృష్టి కారణంగా పంటల విస్తీర్ణం, దిగుబడి తగ్గుతాయి. రాజకీయంగా తీవ్ర ఒడుదొడుకులు ఎదురవుతాయి.
గురు సంచారం: శ్రీ క్రోధి నామ సంవత్సరం చైత్ర కృష్ణ అష్టమి (1-5-2024) పగలు 12-56 గంటలకు గురువు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభంలో గురువు ఉండటం వల్ల శిశువులు, స్త్రీలు, పశువులకు హాని కలుగుతుంది. వర్షపాతం తగ్గుతుంది.
శని సంచారం: దాదాపు ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో ఉంటాడు. వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ప్రజల్లో భయాందోళనలు కలుగుతాయి. వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. సంవత్సరం చివరిలో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు.. పరిస్థితుల్లో పెద్దగా మార్పేం ఉండదు. దుర్మార్గులు ప్రబలుతారు. ప్రకృతి విపత్తులు చోటు చేసుకోవచ్చు. రాజులకు, పాలకులకు నష్టం.
రాహువు-కేతువుల సంచారం : ఈ ఏడాదంతా మీనంలో రాహువు, కన్యలో కేతువు సంచరిస్తారు. ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి.
పుష్కర నిర్ణయం: శ్రీ క్రోధి నామ సంవత్సరం చైత్ర కృష్ణ అష్టమి బుధవారం తేదీ 1/5/2024 పగలు 12.56 గంటలకు దేవ గురువు బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశంతో నర్మదా నది పుష్కరాలు ప్రారంభం. మే 1వ తేదీ నుంచి 12 వరకు పన్నెండు రోజులు పుష్కరాలు కొనసాగుతాయి. పితృ తర్పణాలకు, శ్రాద్ధ విధులకు, స్నాన, దానధర్మాలకు పుష్కరాలు శ్రేష్ఠం.
వాస్తు కర్తరీలు: శ్రీ క్రోధి నామ సంవత్సరం చైత్ర కృష్ణ ఏకాదశి తేదీ 4-05-2024 నుంచి వైశాఖ కృష్ణ పంచమి మంగళవారం తేదీ 28-05-2024 వరకు వాస్తు కర్తరీలు ఉన్నాయి.
ఈ సంవత్సరం భారతదేశంలో కనిపించే గ్రహణాలు ఏమీ లేవు.
రోహిణి కార్తె: శ్రీ క్రోధి నామ సంవత్సరం వైశాఖ కృష్ణ పాడ్యమి శుక్రవారం తేదీ 24-5-2024 రాత్రి 3-16 గంటలకు జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం వృశ్చిక రాశి ప్రయుక్త మీన లగ్నంలో రోహిణి కార్తె ప్రారంభం అవుతున్నది.
ఫలం: పురు- నపుంసక యోగం: సామాన్యవర్షం, సూర్య-సూర్య యోగం: వాయువుతో కూడిన వర్షాలు. మీన లగ్నం: వర్ష యోగం, వాయునాడి: వాయువుతో కూడిన వర్షాలు కురుస్తాయి.
మృగశిర కార్తె: శ్రీ క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠ శుక్ల పాడ్యమి శుక్రవారం తేదీ 7-6-2024 రా 1-05 గంటలకు ఆరుద్ర 1వ పాదం మిథున రాశి ప్రయుక్త మీన లగ్నంలో మృగశిర కార్తె ప్రవేశం.
ఫలం : పురుష-స్త్రీ యోగం: సువృష్టి, చంద్ర-చంద్ర యోగం: సామాన్య వర్షం, మీన లగ్నం: సువృష్టి, సౌమ్యనాడి: అనుకూల వర్షములు.
ఆరుద్ర కార్తె: శ్రీ క్రోధి నామ సంవత్సర జ్యేష్ఠ శుక్ల చతుర్దశి శుక్రవారం తేదీ 21-06-2024 రా 12-05 గంటలకు మూల నక్షత్రం 1వ పాదం ధనుస్సు రాశి ప్రయుక్త మీన లగ్నంలో ఆరుద్ర కార్తె ప్రవేశం.
ఫలం: స్త్రీ-పురుష యోగం: వర్షం, చంద్ర-సూర్య యోగం: సువృష్టి, మీన లగ్నం: సకాల వర్షం, దహన నాడి: అక్కడక్కడా ఎండలతో కూడిన వానలు