Ugadi Panchangam 2023 | శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ( Sobhakritu Nama Samvatsaram )ఫలితాంశాలు
కలి గతాబ్ది: 5124, క్రీస్తుశకం: 2023-24, శాలివాహన శకం: 1945, భారత స్వాతంత్య్ర శకం: 76-77
ఈ సంవత్సరానికి రాజు-బుధుడు, మంత్రి- శుక్రుడు, సేనాధిపతి-గురువు, సస్యాధిపతి-చంద్రుడు, ధాన్యాధిపతి-శని, అర్ఘ్యాధిపతి-గురువు, మేఘాధిపతి-గురువు, రసాధిపతి-కుజుడు, నీరసాధిపతి-చంద్రుడు, రాజవాహనం-డోలా, పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు (స్థాన సంరక్షకుడు)-బలరాముడు, గోష్ఠాద్బహిష్కర్త-శ్రీకృష్ణుడు. నవనాయక వర్గంలో శుభుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటం మంచిది. ఉపనాయక వర్గంలోనూ శుభగ్రహాల ఆధిపత్యం ఉంది. ఫలితంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో అనుకూల వర్షాలు ఉంటాయి. సువృష్టి వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రజల్లో అనుబంధాలు పెరుగుతాయి. సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది.
రాజు- బుధుడు: రాజు బుధుడు కావడం వల్ల ప్రజ లు సుభిక్షంగా ఉంటారు. మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి. ఈ సంవత్సరం మూడు తూముల వర్షం, నాలుగు తూముల వాయువు ఉంది. అపర సస్యాలు (కంది, పెసర, మినుము వంటి పప్పుధాన్యాలు) సమృద్ధిగా పండుతాయి. ఇతర పంటలు కూడా ఓ మోస్తరుగా దిగుబడి సాధిస్తాయి. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఓటీటీ, సినిమా, టీవీ వంటి వినోద రంగాలకు ఆదరణ పెరుగుతుంది. రాజకీయంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నెయ్యి, నూనెగింజలు, పల్లీలు, పత్తి, బంగారం, వెండి, ఇత్తడి, కలప, కాగితం, చింతపండు, ఎరువులు, కంచు, ఉల్లిపాయలు, పసుపు, పొగాకు, అరటిపండ్లు, తమలపాకులు, తేయాకు, విస్తరాకులు, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, చందనం, అగరు వస్తువులు, పెసలు, మినుములు, కందులు, బియ్యం, గోధుమలు, తోళ్లు, బూడిద రంగు వస్తువుల ధరలు, వ్యాపార వాటాలు పెరుగుతాయి.
రాజవాహనం-ఊయల: వివిధ దేశాల్లో దుర్భిక్షం ఏర్పడుతుంది. ఆహార ధాన్యాల కొరత పెరుగుతుంది. పలు దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంటుంది.
మంత్రి-శుక్రుడు: పంటలకు ఈతిబాధలు ఉంటా యి. ఎలుకలు, మిడతల దాడి పెరుగుతుంది. బర్రెలకు, ఆవులకు హాని. ధాన్యం ధరలు పెరుగుతాయి. జానపదులకు, గిరిజనులకు భయాలు పెరుగుతాయి. చెరువులు నిండుకుండల్లా తొణికిసలాడుతాయి.
సేనాధిపతి- గురువు: ప్రజలు, పాలకులు న్యాయవర్తనులై ఉంటారు. ప్రజాభీష్ట పాలన కొనసాగుతుంది. ప్రజలు సంతోషంగా జీవనం సాగిస్తారు. ప్రజల్లో భక్తి పెరుగుతుంది. ధార్మిక జీవనంపై ఆసక్తి కనబరుస్తారు.
సస్యాధిపతి- చంద్రుడు: మత్స్య సంపద పెరుగుతుంది. పాడి రంగం అభివృద్ధి చెందుతుంది. మెట్ట పం టలు బాగా పండుతాయి. చింతపండు, మామిడిపండ్లు, పనస, నారింజ తదితర ఫలాల దిగుబడి బాగుంటుంది. గోధుమలు, జొన్నలు, సజ్జలు, చెరకు, ఉప్పు, తమలపాకులు మొదలైనవాటి ధరలు పెరుగుతాయి.
ధాన్యాధిపతి- శని: మినుములు, నువ్వులు, అవిసెలు, ఆవాలు మొదలైనవి సమృద్ధిగా పండుతాయి. నల్లరేగడి నేలలు మంచి దిగుబడినిస్తాయి.
అర్ఘ్యాధిపతి- గురువు: వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఆధ్యాత్మికత పరిఢవిల్లుతుంది. యజ్ఞయాగాది క్రతువులు విశేషంగా కొనసాగుతాయి. ధార్మిక విషయాల పట్ల పాలకులు ఆసక్తి కనబరుస్తారు.
మేఘాధిపతి- గురువు: సస్య సమృద్ధితో ధరలు తగ్గుతాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరుగుతాయి. ప్రజలు రోగ భయం లేకుండా సుఖాలను అనుభవిస్తారు. అన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు ఉంటాయి. వాణిజ్య రంగం అభివృద్ధి పథంలో సాగుతుంది.
రసాధిపతి- కుజుడు: జీలకర్ర, ఉప్పు, నెయ్యి, నువ్వుల నూనె, బెల్లం మొదలైన పదార్థాల ధరలు నిలకడగా ఉంటాయి. బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతుంది. సారాయి, బ్రాందీ మొదలైన మత్తుపానీయాల ధరలు పెరుగుతాయి.
నీరసాధిపతి- చంద్రుడు: బంగారం, వెండి, కంచు మొదలైన లోహాలు, నవరత్నాలు, అలంకరణ వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. దుస్తుల ధరలు నిలకడగా ఉంటాయి.
పశుపాలకుడు-బలరాముడు: పంటలకు అనుకూల వర్షాలు కురుస్తాయి. పంటలు అధిక దిగుబడిని ఇస్తాయి. మధ్య భారతంలో పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ధరలు మధ్యమంగా ఉంటాయి.
గోష్ఠాద్బహి ప్రాపకుడు- శ్రీకృష్ణుడు: పశుసంపద వృద్ధి చెందుతుంది. పంటల దిగుబడి పెరగడం వల్ల ధరలు నిలకడగా ఉంటాయి. పశుపాలకుడు, స్థాన సంరక్షకుడు బలరాముడు కావడం వల్ల పాడిపంటలు బాగుంటాయి. ప్రజా సంక్షేమం మధ్యమంగా ఉంటుంది.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఫలం
అన్ని రకాల పంటలు బాగా పండుతాయి. పాలకులు, ప్రజలు పరస్పర స్నేహం కలిగి ఉంటారు. ప్రజాభీష్ట పరిపాలన ఉంటుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ మాసాల్లో ధాన్యాదుల ధరలు అధికంగా ఉంటాయి. రాజకీయాలు ఒడుదొడుకులకు గురవుతాయి. కొన్నిచోట్ల ఉత్పాత భయాలు నెలకొంటాయి. ఆషాఢంలో స్వల్పవృష్టి ఉంటుంది. ఉభయ శ్రావణాల్లో (అధిక, నిజ మాసాలు) వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. భాద్రపదంలో అతివృష్టి, వరదలు ఉంటాయి. ఆశ్వయుజంలో ఆహార ధాన్యాల ధరలు తగ్గుతాయి. కార్తికం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణ మాసాల్లో దేశ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ధాన్యం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రజల్లో కలహాలు చెలరేగుతాయి. స్వల్పకాలంలోనే సద్దుమణుగుతాయి.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పాడ్యమి తేది 21-4-2023 శుక్రవారం తెల్లవారితే శనివారం అనగా రా.తె. 5-09 గంటలకు గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఉగాది మొదలుకొని వైశాఖ శుద్ధ పాడ్యమి వరకు మీనరాశిలో గురువు సంచారం వల్ల నాయకులకు, ప్రజలకు అన్యోన్యత ఏర్పడుతుంది. పాలకులు ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు. సంక్షేమ పథకాలను సంపూర్ణంగా అమలుచేస్తారు. ఏప్రిల్ 22 నుంచి సంవత్సరాంతం వరకు గురువు మేషంలోనే సంచరిస్తాడు. పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రజారోగ్యం మెరుగుపడుతుంది. పంటలకు అనుకూలమైన వర్షాలు కురుస్తాయి. పాలకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో ఈతి బాధలు అధికమవుతాయి.
గతేడాది అంటే శుభకృత్ నామ సంవత్సరం పుష్య కృష్ణ దశమి మంగళవారం తేది 17-1-2023 శనైశ్చరుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. తదాది శోభకృత్ సంవత్సరం మొత్తం శని అదే రాశిలో సంచరిస్తాడు. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయి. పాలకుల మధ్య వైషమ్యాలు పొడచూపుతాయి. విదేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. పంటలకు చీడపీడల బాధ అధికమవుతుంది.
సంవత్సరం ఆరంభం నుంచి 30-10-2023 వరకు రాహువు మేషంలో, కేతువు తులారాశిలో సంచరిస్తారు. ఆశ్వయుజ కృష్ణ విదియ తేది 30-10-2023 సోమవారం సాయంత్రం 4-35 గంటలకు రాహువు మీనంలోకి, కేతువు కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు. తదాది సంవత్సరాంతం వరకు ఆ రాశుల్లోనే సంచరిస్తారు.
సూర్యుడు అగ్ని నక్షత్రమైన కృత్తికపై సంచరించే కాలాన్ని వాస్తు కర్తరీ అని పిలుస్తారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ శుక్ల చతుర్దశి తేది 4-5-2023 గురువారం తెల్లవారితే శుక్రవారం అనగా రా.తె. 3-28 గంటల నుంచి జ్యేష్ఠ శుక్ల నవమి సోమవారం తేది 29-5-2023 ఉదయం 8-16 వరకు వాస్తు కర్తరీలు ఉన్నాయి.
ఇవి చేయవచ్చు: గృహప్రవేశం, ఉపనయనం, వివాహం, యజ్ఞయాగాదులు చేసుకోవచ్చు.
ఇవి చేయకూడదు: గృహారంభం, నూతన వస్త్రధారణ, విత్తన నాట్లు, కేశ ఖండనం, కొత్త వాహనం కొనడం, దేవాలయ ఆరంభం, బావి తవ్వడం, గడ్డికోత పనికిరావు.
శ్రీ శోభకృత్ నామ సంవత్సర చైత్ర శుక్ల షష్ఠి తేది 27-3-2023 సోమవారం తెల్లవారితే మంగళవారం రా.తె. 5-47 గంటలకు గురు మూఢం మొదలవుతుంది. వైశాఖ శుక్ల షష్ఠి తేది 26-4-2023 బుధవారం తెల్లవారితే గురువారం రా.తె. 5-05 గంటల వరకు గురు మూఢం ఉన్నది.
శ్రీ శోభకృత్ నామ సంవత్సర అధిక శ్రావణ కృష్ణ పంచమి తేది 6-8-2023 ఆదివారం తెల్లవారితే సోమవారం రా.తె. 4-36 నుంచి నిజ శ్రావణం శుక్ల తదియ తేది 19-8-2023 శనివారం తెల్లవారితే ఆదివారం రా.తె. 4-27 గంటల వరకు శుక్ర మూఢం ఉంది.
l మూఢంలో వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, గృహారంభం, దేవతా ప్రతిష్ఠ, తీర్థయాత్రలు, పుట్టు వెంట్రుకలు, యజ్ఞాలు చేయరాదు.
l జన్మ నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు చేసుకోవచ్చు.
రోహిణి కార్తె: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం జ్యేష్ఠ శుక్ల షష్ఠి గురువారం తేది 25-5-2023 రాత్రి 8-58 గంటలకు ఆశ్లేష నక్షత్రం ప్రథమ పాదం, కర్కాటక ప్రయుక్త కన్యా లగ్నంలో రోహిణి కార్తె ప్రవేశం.
ఫలం: పురుష-స్త్రీ యోగం: సువృష్టి, సూర్య-చంద్ర యోగం: మంచి వర్షాలు కురుస్తాయి. కన్యాలగ్నం: అనావృష్టి. అమృతనాడి: అననుకూల వర్షాలు.
మృగశిర కార్తె: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం జ్యేష్ఠ కృష్ణ పంచమి గురువారం తేది 8-6-2023 సాయంత్రం 6-53 గంటలకు శ్రవణం నక్షత్రం, నాలుగో పాదం.. మకర రాశి ప్రయుక్త వృశ్చిక లగ్నంలో మృగశిర కార్తె ప్రవేశం.
ఫలం: పురుష-పురుష యోగం: స్వల్ప వృష్టి. చంద్ర-చంద్ర యోగం: సామాన్య వర్షం. వృశ్చిక లగ్నం: మోస్తరు వర్షాలు. వాయునాడి: వాయువుతో కూడిన వర్షపాతం.
ఆరుద్ర కార్తె: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆషాఢ శుక్ల చవితి గురువారం తేది 22-6-2023 సాయంత్రం 5-48 గంటలకు ఆశ్లేష నక్షత్రం, మూడోపాదం కర్కాటక రాశి ప్రయుక్త వృశ్చిక లగ్నంలో ఆరుద్ర కార్తె ప్రవేశం.
ఫలం: స్త్రీ-స్త్రీ యోగం: స్వల్ప వృష్టి, చంద్ర-చంద్ర యోగం: మోస్తరు వానలు. వృశ్చిక లగ్నం: సామాన్య వృష్టి. ప్రవేశ సమయ తిథి పంచమి: శుభప్రదం. గురువారం: సుభిక్షం. వృశ్చిక లగ్నం: ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణం. హర్షణ నామయోగం: శుభసూచన. సాయంత్రం ప్రవేశం: అనుకూల వర్షాలు. బవ కరణం: సుఖప్రదం.