భాష వెంట భావం
భావం వెంట భాష
ఉందని అనుకోవడం లేదు
భాషలో భావం
భావంలో భాష
కలిసే గమనం కడదాకా సహజీవనం
భాష అతీతమైంది..
భావం అమూల్యమైంది
భాష భావం జత అమోఘమైంది
మనసు భాషైతే..దేహమే భావం
పువ్వు భాషైతే..తావే భావం
నీడను వెలుగు పిలిచినట్టు
విత్తనాన్ని నేల మోసినట్టు భావం భాష
ఒకటి ఊపిరి నింపుకునే శూన్యం
మరొకటి మృతువును జయించే
జీవచైతన్య కావ్యం
భాషకు భావాలన్నీ ప్రియమే
భేదభావాలు, శత్రుభావాలు ఉండవ్
కొన్నిసార్లు
మౌనంగా నిలబడ్డ భావనకి భాషే ఊరట
నిస్సహాయతగా ఎదురుచూస్తున్న భావుకతకి భాషే ఓదార్పు
అవ్యక్తంగా బయటకు రావటానికి
ఘర్షణ పడుతున్న భావనకి
భావుకతకి భాషే లాలన
భాష స్మరణంలో
శరణు వేడే భావాలన్నీ అమరం
ఒకే జలధారకు రెండు అలలు
ఒకే కనుపాపకు రెండు కలలు