పనాజీ : తాంత్రికుడిగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన గోవాలో కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడి (50)తో పాటు అతడికి సహకరించిన బాధితురాలి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు సోమవారం బాలిక (14)ను తన ఇంటికి పిలిపించి ఆమె కోరికలు నెరవేరేలా చూస్తానని మభ్యపెడుతూ లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ విషయంలో నిందితుడికి సహకరించిన బాధితురాలి తల్లి (43)ని కూడా అరెస్ట్ చేశామని డీఎస్పీ జివ్బా దల్వి తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని వెల్లడించారు.