లక్నో : యూపీలో బాలికలు, మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఎనిమిదో తరగతి చదివే బాలికను స్కూల్ వద్ద లైంగిక వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అర్షియన్ బాలికను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు.
బాలిక భయంతో ఈ విషయం ఇంట్లో చెప్పకపోవడంతో పాటు స్కూల్‌కు వెళ్లడం కూడా మానేసింది. ఒకరోజు బాలిక స్కూల్‌కు చేరుకోగానే అర్షియన్ ఆమె చేయి పట్టుకుని లైంగికంగా వేధించేందుకు స్కూల్ వెనుకకు తీసుకువెళ్లాడు. అదే సమయంలో స్కూల్‌కు చేరుకున్న కుటుంబసభ్యులు ఆమెను కాపాడారు.
బాలిక కుటుంబ సభ్యులు అక్కడికి రావడం చూసిన నిందితుడు ఘటనా స్ధలం నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా గోమతినగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుడిని గుర్తించిన పోలీసులు అనంతరం అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.