Abhaya Movie | మహిళా సాధికారత నేపథ్యంలో పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ‘అభయ’ సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైంది. గ్రాడియెంటే ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్ అధినేత డా. విమల్ రాజ్ మాథుర్, ఆర్.డి.జి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూపేష్ డి. గోహిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూసఫ్ ముజామ్మిల్ సుర్తి దర్శకత్వంలో తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో యోగిత భోసాలె ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మోహన్ జోషి, గణేష్ యాదవ్, కమలేష్ సావంత్, అనికేత్ కేల్కర్, రోహిత్ కోకటి, ఉమేష్ బోల్కె, డా. సంజీవ్ కుమార్ పాటిల్, హర్ష్ నికమ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత డా. విమల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ, అభయ కేవలం సినిమా మాత్రమే కాదని, సమాజానికి ఒక బలమైన సందేశమని పేర్కొన్నారు. తరతరాలుగా ఎందరికో ప్రేరణగా నిలుస్తున్న మహిళల శక్తిని, పట్టుదలను ఈ చిత్రం ద్వారా సెలబ్రేట్ చేయబోతున్నామని, త్వరలోనే సినిమా వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. మరో నిర్మాత రూపేష్ డి. గోహిల్ మాట్లాడుతూ, ఈ సినిమా ఒక అర్థవంతమైన సందేశాన్ని అందించడమే కాకుండా, బలమైన కథనంతో సాగుతుందని తెలిపారు. ఈ ప్రేరణాత్మక చిత్రాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు.