Venkataramayya Gari Taluka | దినేష్ కుమార్ హీరోగా, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది.
మానవ సంబంధాలు, తల్లిదండ్రుల విలువ, కుటుంబ బంధాలు, ఫాదర్ సెంటిమెంట్ ప్రధానాంశాలుగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుత సమాజంలో డబ్బు చుట్టూ తిరుగుతున్న మానవ సంబంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను హృద్యంగా ఆవిష్కరించిన కుటుంబ కథా చిత్రమిది. ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, సుధ కీలక పాత్రలు పోషించారు. ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ ముత్యాల సుబ్బయ్య గారి చిత్రాలను గుర్తు చేసే గొప్ప కథ ఇదని, నాన్న గొప్పతనం, తల్లిదండ్రుల విలువను ఎంతో హృద్యంగా చూపించారని అన్నారు. డాక్టర్ అవుతుందనుకున్న తన కుమార్తె దివిజ ఈ సినిమాతో నటిగా పరిచయమవుతోందని తెలిపారు. దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ మన దేశ సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం గొప్ప సంప్రదాయమని, కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా చూపిస్తుందని అన్నారు. నిర్మాతలు కోమలి, మహేందర్ మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో చూసిన అనుభవాలను ఈ సినిమాలో చూపించామని, సినిమా చూస్తున్నంతసేపు కంటతడి పెట్టకుండా ఎవరూ బయటకు రారని అన్నారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అందించిన ఆరు పాటలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయని తెలిపారు. హీరో దినేష్ కుమార్, హీరోయిన్ దివిజ ప్రభాకర్‌తో పాటు కాశి విశ్వనాథ్, సెల్వరాజ్, మిర్చి మాధవి, జబర్దస్త్ సత్యశ్రీ తదితరులు నటించారు.