Tillu Square | టిల్లు స్వేర్ రివ్యూ
సినిమా పేరు : టిల్లు స్కేర్
తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీశర్మ, మురళీధర్‌గౌడ్, నేహాశెట్టి..
దర్శకత్వం: మల్లిక్ రామ్
స్క్రీన్‌ప్లే, మాటలు: సిద్ధు జొన్నలగడ్డ
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, ఎస్.సాయిసౌజన్య
సిద్ధు జొన్నలగడ్డని రాత్రికి రాత్రి స్టార్బోయ్ని చేసిన సినిమా ‘డీజే టిల్లు’. ఏ అంచనాలు లేకుండా విడుదలైన ఆ సినిమా ఆ ఏడాది విడుదలైన భారీ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ‘డీజే టిల్లు’ కేరక్టరైజేషన్‌కి యువతరంలో ఫాన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పాత్రతో సిద్ధు వస్తున్నాడనగానే ‘టిల్లు స్కేర్’పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దానికి తోడు ఇందులో కథానాయిక అనుపమ పరమేశ్వరన్. దాంతో ఈ సినిమాకోసం యూత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. ప్రమోషన్లో భాగం విడుదలైన ట్రైలర్లకు, టీజర్లకు, ఇన్‌స్టా గ్లింప్స్ కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదలైన ‘టిల్లు స్కేర్’ పేరుకు తగ్గట్టు డబుల్ ఎంటర్టైన్మెంట్ని ఇచ్చాడా? లేక అంచనాలు తప్పాడా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
రాధికతో పంచాయితీ ముగిశాక, వచ్చిన డబ్బుతో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రారంభించి రిచ్‌గా బతికేస్తుంటాడు టిల్లు. టిల్లు మేనేజ్మెంట్ పార్టీ అంటే జనాల్లో పిచ్చ క్రేజ్. ఓ రోజు టిల్లుకు పబ్‌లో లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) తారసపడుతుంది. ఆమె అందానికి తొలి చూపులోనే ఫ్లాటైపోతాడు టిల్లు. ఆమెకు కూడా టిల్లులోని హ్యూమర్, యాటిడ్యూడ్ నచ్చి అతనితో పెదవి కలుపుతుంది. ఆ రాత్రి ఇద్దరూ ఒకటవుతారు. తెల్లారితే లిల్లీ కనిపించదు. అక్కడే తను వదిలివెళ్లిన లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ చదివి, లిల్లీ కోసం వెతకడం మొదలుపెడతాడు టిల్లు. రోజూ ఆమె ధ్యానంలోనే ఉంటూ ఉంటాడు. నెల రోజుల తర్వాత ఓ హాస్పిటల్లో లిల్లీ కనిపిస్తుంది. తాను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. టిల్లు పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకొస్తాడు. ఇలా ఆనందంగా అతని జీవితం నడుస్తుంటుంది. ఆ రోజు టిల్లు పుట్టినరోజు. టిల్లుకు ఫోన్ వస్తుంది. ఫోన్లో లిల్లీ.. తన ఫ్లాట్‌కి అర్జంట్‌గా రమ్మంటుంది. తను వెళ్తాడు.. తీరా వెళ్లాక తెలుస్తుంది అది రాధిక ఫ్లాట్. రాధిక ఫ్లాట్‌లో లిల్లీకి పనేంటి? రాధికకూ లిల్లీకీ మధ్య సంబంధం ఏంటి? టిల్లూని లిల్లీ ఎందుకు కలిసింది? అసలు ఈ లిల్లీ ఎవరు? ఈ ప్రశ్నలకు సమధానమే మిగతా కథ.
విశ్లేషణ
‘డీజే టిల్లు’ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కేవలం టిల్లు కేరక్టరైజేషన్. అతని డైలాగులు, తెరపై అతని ప్రవర్తన. ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నది ఇవే. అందుకే కథ గురించి పట్టించుకోకుండా కేవలం నవ్వుకోడానికే ‘డీజే టిల్లు’కు వెళ్లారు జనం. ఇప్పుడు ‘టిట్లు స్వేర్’తో మరోసారి ఆ మేజిక్ రిపీట్ చేయాలనుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. తనే కథ, కథనం, సంభాషణలు అన్నీ తానే అయి ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడు. తొలి పార్ట్‌కి ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా నటించాడు. ఓ విధంగా మళ్లీ సక్సెస్ సాధించాడనే చెప్పాలి. ఎందుకంటే ఈ ‘టిల్లు స్కేర్’లో ఎక్కడా విసుగు ఉండదు. తొలి పార్ట్‌తో పోల్చుకుంటే కాస్త ఫన్ తగ్గినా, వినోదానికి మాత్రం ఢోకా ఉండదు. యూత్‌కి కావాల్సిన అన్ని అంశాలు ‘టిల్లు స్కేర్’లో ఉన్నాయి. ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా ఈ సినిమా మొదలైంది. కథ, పాత్రలు అన్నీ తొలి పార్ట్లోవే కనిపిస్తాయి. అందులో టిల్లు సమస్యలో ఇరుక్కున్నట్టే, ఇందులోనూ సమస్యలో ఇరుక్కుంటాడు. ఓ విధంగా పాత సినిమాను మళ్లీ చూస్తున్నట్టు అనిపించినా, సిద్ధు తన నటనతో డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేశాడు. తొలిభాగంలోని రాధిక(నేహాశెట్టి) ప్రీ ైక్లెమాక్స్‌లో ఎంటరవ్వడంతో సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయింది. అయితే ైక్లెమాక్స్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదనే చెప్పాలి.
నటీనటుల నటన
తొలి భాగం మాదిరిగానే అన్నీ తానై, సినిమాను తన భుజాలపై మోశాడు సిద్ధు జొన్నలగడ్డ. అతని చెలాకీ తనానికీ, అతని హైపర్ యాక్టీవ్నెస్కీ ఎవరైనా ఫీదా అయిపోవాల్సిందే. అద్భుతమైన డైలాగ్ టైమింగ్‌తో అందరినీ అలరించాడు సిద్ధు. ఇక అనుపమ పరమేశ్వరన్ అందచందాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాలో తను చాలా హాట్‌గా కనిపించడమే కాక, పెదవి ముద్దుల విషయంలో పరిథుల్ని దాటి నటించిందనే చెప్పాలి. మిగతా నటీనటులందరూ కూడా పరిథిమేర రక్తికట్టించారు.
సాంకేతికంగా..
ఈ సినిమాకు ప్రధాన బలం సిద్ధు జొన్నలగడ్డ సంభాషణలు. రచయితగా కూడా సత్తా చాటాడు సిద్ధు. అలాగే నవీన్ నూలి కూర్పు ఎక్కడా విసుగు లేకుండా, ల్యాగ్ లేకుండా చక్కగా కుదిరింది. రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల, అచ్చు రాజమణి, భీమ్స్ అందించిన పాటలు సినిమా విడుదలకు ముందే విజయాన్ని సాధించి, సినిమాకు పాజిటీవ్ వైబ్ రావడానికి కారణమయ్యాయి. పాటల చిత్రీకరణ కూడా బావుంది. ఇక దర్శకుడు మల్లిక్ రామ్, తొలి పార్ట్‌కు ఏ మాత్రం తీసిపోకుండా సినిమా తెరకెక్కించడానికి ప్రయత్నించి, కొంతమేర సక్సెస్ అయ్యాడు. మొత్తంగా సినిమా బాగా హ్యాండిల్ చేశాడనే చెప్పాలి. కేవలం యువతరం కోసం రూపొందిన సినిమా ఇది. లాజిక్కులతో పనిలేకుండా కేవలం వినోదమే కోసమే సినిమాకు వెళ్లే ప్రేక్షకులకు కావల్సినంత టైంపాస్ ‘టిల్లు స్వేర్’.
ప్లస్ పాయింట్స్ :
సిద్ధు జొన్నలగడ్డ నటన, అతని సంభాషణలు, కామెడీ, అనుపమ అందచందాలు..
మైనస్ మాయింట్స్:
పాత కథనే మళ్లీ చూస్తున్న ఫీలింగ్..
రేటింగ్: 3.25/5