SKYMovie | టాలీవుడ్ నూతన దర్శకుడు పృధ్వీ పేరిచెర్ల దర్శకత్వంలో, మురళీ కృష్ణంరాజు హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం “స్కై”. వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు మరియు పృధ్వీ పేరిచెర్ల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
ఈ కథ ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల ఒంటరితనం చుట్టూ తిరుగుతుంది. ప్రభు (ఆనంద్) ఒక సింగర్. కెరీర్ మీద దృష్టి పెట్టి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల భార్యను, కొడుకును కోల్పోయి ఒంటరివాడవుతాడు. గత స్మృతులతో బాధపడుతూ రెస్టారెంట్లలో పాడుతూ కాలం వెళ్లదీస్తుంటాడు. విక్కీ (మురళీ కృష్ణంరాజు) ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, స్నేహితుడు జాఫర్‌తో కలిసి ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి ఒంటరితనాన్ని అలవాటు చేసుకున్న వ్యక్తి. వీణ (శృతి శెట్టి) అనుకోకుండా విక్కీ పరిచయం అవ్వడం, అతని నిజాయితీ నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. అయితే, తన ఒంటరి ప్రపంచంలోకి వీణను ఆహ్వానించడానికి విక్కీ ఎందుకు భయపడ్డాడు? ప్రభు జీవితంలో కోల్పోయిన ఆనందం మళ్ళీ దొరికిందా? వీరి ముగ్గురి జీవితాలు క్లైమాక్స్‌లో ఎలా కలిశాయి అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
దర్శకుడు పృధ్వీ పేరిచెర్ల ఎంచుకున్న పాయింట్ చాలా సున్నితమైంది. మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్, ముఖ్యంగా ‘ఒంటరితనం’ మనిషిని ఎలా మారుస్తుంది అనే అంశాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. ఫస్టాఫ్ పాత్రల పరిచయం, విక్కీ-వీణల మధ్య సాగే సరదా సన్నివేశాలతో కథ నెమ్మదిగా, ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ లో హీరోయిన్ ప్రేమను వ్యక్తం చేసే విధానం బాగుంది. సెకండాఫ్ సినిమాకు అసలైన బలం సెకండాఫ్. పాత్రల అంతర్లీన సంఘర్షణను, ఎమోషనల్ డ్రామాను దర్శకుడు చాలా డీటెయిల్డ్‌గా చూపించారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరచడమే కాకుండా మనసుకి హత్తుకుంటుంది.
నటీనటుల ప్రతిభ:
తొలి సినిమా అయినప్పటికీ విక్కీ పాత్రలో చాలా ఈజ్‌తో నటించారు మురళీ కృష్ణంరాజు. కామెడీ మరియు ఎమోషనల్ సీన్స్‌లో మంచి పరిణితి కనబరిచారు. శృతి శెట్టి వీణ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటన సహజంగా ఉంది. సీనియర్ నటుడు ఆనంద్ ‘ప్రభు’ పాత్రలో జీవించారని చెప్పాలి. ఆయన అనుభవం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. రాకేశ్ మాస్టర్, మణిబామ్మ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం:
రసూల్ ఎల్లోర్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హైదరాబాద్ సిటీ ఏరియల్ షాట్స్ మరియు సాంగ్స్ పిక్చరైజేషన్ రిచ్‌గా ఉంది. శివప్రసాద్ అందించిన మెలోడీలు వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా “తపనే తెలుపగ” సాంగ్ విజువల్ గా కూడా బాగుంది. దర్శకుడు పృధ్వీ స్వయంగా రాసిన లిరిక్స్ కథలోని లోతును వివరించాయి.
సురేష్ ఆర్స్ పనితీరు బాగుంది, ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించారు.
ప్లస్ పాయింట్స్:
బలమైన ఎమోషన్స్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్.
నటీనటుల పెర్ఫార్మెన్స్.
రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ.
మైనస్ పాయింట్స్:
కథనం అక్కడక్కడా నెమ్మదిగా సాగడం.
మొత్తానికి “స్కై” ఒక స్వచ్ఛమైన, ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా. ఒంటరితనం మీద సాగే ఈ ప్రయాణం అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను అలరిస్తుంది.
రేటింగ్: 2.75/5