Singer | ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ టేలర్ ట్విస్ట్ , అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీ వివాహం జరిగినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఇద్దరూ న్యూయార్క్‌లో అత్యంత వైభవంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారని, ప్రపంచవ్యాప్తంగా సినీ, సంగీత, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారని పేర్కొంటున్నారు. ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం, ఈ వేడుకకు ప్రముఖ వేదికగా మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ నిలిచిందని, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వివాహ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
వైరల్ కథనాల ప్రకారం, ఈ వేడుకకు హాలీవుడ్, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరైనట్లు పేర్కొంటున్నారు. హాలీవుడ్ తారలు సెలెనా గోమెజ్, గిగీ హడిద్, బ్రాడ్లీ కూపర్, జో క్రావిట్జ్, హ్యూ గ్రాంట్, ఈథన్ హాక్, డకోటా జాన్సన్‌లతో పాటు పాప్ సింగర్ ఎడ్ షీరన్ వంటి దిగ్గజాలు హాజరయ్యారు. టేలర్ స్విఫ్ట్ చిన్ననాటి స్నేహితురాళ్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. క్రీడా ప్రపంచం నుంచి పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. వివాహానికి ముందు రోజు గ్రాండ్ రిహార్సల్ డిన్నర్ నిర్వహించారని, అందులో దాదాపు వెయ్యి మంది అతిథులు పాల్గొన్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే అత్యంత సన్నిహితుల కోసం ప్రత్యేకంగా మరో ప్రైవేట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారని, ఆ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు చెబుతున్నారు.
వైరల్ కథనాల్లో ఎక్కువగా చర్చనీయాంశమైన అంశం అతిథులకు అందించిన బహుమతులే. రిహార్సల్ డిన్నర్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ వజ్రాలతో అలంకరించిన ఖరీదైన షాంపైన్ గ్లాసులను కానుకగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నల్లటి వెల్వెట్ బాక్సుల్లో అందించిన ఈ గిఫ్ట్‌లపై “T&T” అక్షరాలతో పాటు రెండు హృదయాల గుర్తులు ముద్రించి ఉన్నాయని కూడా సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు పేర్కొంటున్నాయి. అయితే ఈ వివాహానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సమాచారం, ఫొటోలు, వివరాలపై ఇప్పటివరకు టేలర్ స్విఫ్ట్ లేదా ట్రావిస్ కెల్సీ తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే విశ్వసనీయ అంతర్జాతీయ వర్గాల నుంచి కూడా ఈ కథనాలకు అధికారిక నిర్ధారణ అందుబాటులో లేదు. అందువల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వివరాలను ధృవీకరించని ప్రచారంగా మాత్రమే పరిగణించడం మంచిది.